మోడీ ‘కులం’ కార్డు
* తక్కువ కులంలో పుట్టడం నేరమా?
* ప్రియాంక ‘నీచ రాజనీతి’ వ్యాఖ్యలపై ఎదురుదాడి
మహరాజ్‌గంజ్(యూపీ): ప్రత్యర్థులు నీచ రాజనీతిని అవలంబిస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ చేసిన విమర్శలను బీజే పీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తిప్పికొట్టారు. తక్కువ కులంలో పుట్టడం నేరం కాదని, తాను చాయ్ అమ్ముకున్నానే కానీ దేశాన్ని కాదని చురకలంటించారు. ‘వెనుకబడిన వర్గాల వారిని నీచంగా చూస్తున్నారు. మీరు మోడీని అవమానించవచ్చు. ఉరితీయవచ్చు. కానీ అల్ప వర్గాలను అవమానించకండి’ అంటూ ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా మోడీ కులం కార్డు ప్రయోగించారు. ‘గతంలో ఆంధ్రప్రదేశ్ సీఎం అంజయ్యను రాజీవ్‌గాంధీ అవమానించార ని చెప్పాను. ఇప్పుడు మోడీని అవమానిస్తున్నారు సరే... కానీ మేం నీచ రాజకీయాలకు పాల్పడుతున్నామంటున్నారు.
వెనుకబడిన కులాల్లో పుట్టడం నేరమా? అలా జన్మించి నేనెవరినైనా అవమానించానా? నాపై ఎందుకు బురద చల్లుతున్నారు?’ అని ఉద్వేగభరితంగా వ్యాఖ్యానించారు. తన తండ్రి రాజీవ్‌గాంధీని మోడీ అవమానిస్తున్నారని, ఆయన నీచ రాజకీయాలు చేస్తున్నారని ప్రియాంకా గాంధీ సోమవారం అమేథీ ఎన్నికల ప్రచారంలో సంగతి తెలిసిందే. దీనిపై తీవ్రంగా స్పందించిన మోడీ.. ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని ఇలాంటి రాజకీయ దాడులను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. ‘నీచ రాజనీతి’ వ్యాఖ్యలు చేసిన ప్రియాంక దేశానికి, మోడీకి క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. మరోవైపు ప్రియాంకా గాంధీపై మోడీ విమర్శలను కాంగ్రెస్ తప్పుబట్టింది. ఆయన్ని మహా మాయగాడిగా అభివర్ణించింది. మోడీ కావాలనే వాస్తవాలను వక్రీకరిస్తున్నారని మండిపడింది.