సాక్షి, చెన్నై:ఈ సారి అధికారం తమదేనని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. తమిళనాడులో బీజేపీ కూటమి అభ్యర్థులకు ప్రచారం చేసేందుకు మోడీ ఆదివారం చెన్నైకు వచ్చారు. మధ్యాహ్నం బెంగళూరులో ప్రచార సభను ముగించుకుని చెన్నైకు వచ్చిన నరేంద్ర మోడీకి బీజేపీ కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక విమానంలో సాయంత్రం ఐదున్నర గంటలకు మీనంబాక్కం విమానాశ్రయం చేరుకున్న మోడీకి ఆ పార్టీ రాష్ర్ట, జాతీయ నాయకులు పొన్ రాధాకృష్ణన్, మురళీ ధరరావు, ఇలగణేశన్, వానతీ శ్రీనివాసన్‌లతో పాటుగా కూటమి పార్టీల నాయకులు ఆహ్వానించారు. కాసేపు మీనంబాక్కం విమానాశ్రయంలో విశ్రాంతి తీసుకున్న మోడీ, అక్కడి నుంచి నేరుగా పోయేస్ గార్డెన్‌లోని దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీ కాంత్ ఇంటికి వెళ్లారు. రజనీ కాంత్‌తో భేటీ అనంతరం మీనంబాక్కం జైన్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రచార వేదికకు చేరుకున్నారు.
అభ్యర్థుల పరిచయం
ప్రచార సభ వేదికపై ధర్మపురి, చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, శ్రీ పెరంబదూరు, అరక్కోణం, వేలూరు, ఆరణి, అభ్యర్థులను పేరుపేరున పిలుస్తూ ప్రజలకు పరిచయం చేశారు. ఆదివారం మహావీర్ జయంతి అని, సోమవారం అంబేద్కర్ జయంతి అని గుర్తు చేస్తూ, ఇదే రోజు తమిళుల కొత్త సంవత్సరం కూడా రావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఁ్ఙతమిళనాడు ప్రజలతో పాటుగా దేశ ప్రజలందరికీ వరాలు ఇవ్వాలని, ఆశీస్సులు అందించాలని లక్ష్మీ దేవి, సరస్వతి దేవిలను ప్రార్థిస్తున్నానురూ.రూ. అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
నగారాతోనే ఫలితాలు
ఈ లోక్ సభ ఎన్నికలు ప్రత్యేకతను సంతరించుకున్నట్టు వివరించారు. తన జీవితంలో ఎన్నో ఎన్నికలు చూశానని, అయితే, ప్రజల్లో కట్టలు తెంచుకున్న ఆవేశాన్ని ఈ ఎన్నికల ద్వారానే చూస్తున్నట్టు పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే ప్రపథమంగా ఎన్నికల నగారాతో పాటుగానే ఫలితాన్ని కూడా ప్రజలు ఇచ్చేశారంటూ, అధికారంలో రాబోయేది బీజేపీ అన్నది స్పష్టమయ్యిందన్నారు. యూపీఏ సర్కారకు చరమ గీతం పాడి కొత్త ప్రభుత్వాన్ని ఆహ్వానించేందుకు ప్రజలు సిద్ధం అయ్యారని ధీమా వ్యక్తం చేశారు. ఎంతో నమ్మకంతో కూడుకున్న ఈ ఎన్నికలతో పదేళ్లు తాము పడ్డ కష్టం నుంచి బయట పడటం లక్ష్యంగా ప్రతి ఓటరు శపథం తీసుకుని ఉన్నారని పేర్కొన్నారు.
సరికొత్త ప్రభుత్వం ఏర్పాటు
కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టగానే, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలసి సరి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రాల హక్కులను యూపీఏ సర్కారు కాలరాసిందని, రాష్ర్ట ప్రభుత్వాలను తన బానిసలుగా చూశారని, ఇందుకు ప్రత్యక్ష సాక్షిని తానేనన్నారు. అన్ని రాష్ట్రాలతో స్నేహ పూర్వకంగా వ్యవహరించి దేశ సమగ్రాభివృద్ధిని కాంక్షించే రీతిలో ముందుకు సాగుబోతున్నామని స్పష్టం చేశారు. దేశ ఎన్నికల చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో ఎన్డీఏలో బీజేపీతో కలసి 25 పార్టీలు చేరాయని వివరించారు.దొందూ దొందే : రాష్ట్రంలోని డీఎంకే, అన్నాడీఎంకేలు దొందూ దొందేనని మోడీ విమర్శించారు. ఈ రెండు ప్రభుత్వాలు మార్చి మార్చి అధికారంలోకి రావడం వలన రాష్ట్రంలో అభివృద్ధి కుంటు పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు అధికారంలోకి వస్తే వీరి పథకాల్ని, మనుషులను అణచి వేస్తారని, వీళ్లు అధికారంలోకి వస్తే వాళ్లను అణచి వేస్తారని విమర్శించారు. కక్ష సాధింపు కోసం ఇచ్చే ప్రాధాన్యతను, చిత్తశుద్ధిని రాష్ట్రం మీద ఈ రెండు పార్టీలు ఎన్నడూ పెట్టలేదని ధ్వజమెత్తారు.
ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా మహా శక్తివంతంగా బీజేపీ కూటమి ఆవిర్భవించడం రాష్ట్ర ప్రజలకు శుభ పరిణామంగా పేర్కొన్నారు. తమిళ ప్రజల హక్కులను, మనోభావాల్ని గౌరవించే రీతిలో, ఇక్కడి ప్రజల ఆశల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చే శక్తిగా ఈ కూటమి పని చేస్తుందని హామీ ఇచ్చారు. తమిళ జాలర్ల సంక్షేమం లక్ష్యంగా బీజేపీ నిర్ణయాలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రపంచ దేశాల్లో త మిళులు ఉన్నారని, అందరూ వేర్వేరు చోట్ల ఉన్నా, అందరి రక్తం ఒక్కటే అని వ్యాఖ్యానించారు. బీజేపీ సర్కారు అధికారంలోకి రాగానే, జాలర్ల మీద దాడులకు అడ్డుకట్ట వేసే రీతిలో నిర్ణయం తీసుకుంటుందని, ఇదే తాను తమిళనాడు ప్రజలకు ఇస్తున్న హామీగా ప్రకటించారు. అయితే ఎప్పుడూ ఉత్తరాది సంప్రదాయ దుస్తుల్లో కనిపించే నరేంద్ర మోడీ, ఆదివారం దక్షిణాది సంప్రదాయ దుస్తులైన పంచెతో వేదికపైకి రావడం విశేషం.
అధికారం మాదే!
Published Mon, Apr 14 2014 1:56 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement