ఇద్దరు ప్రముఖుల కరచాలనం
భువనేశ్వర్ : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల వాతావరణం ముందస్తు సంకేతాలు బలపడుతున్న తరుణంలో తాజా నివేదిక మరో కొత్త మలుపును ఆవిష్కరించింది. ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నవీన్ పట్నాయక్, భావి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ టికెట్‌తో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న కేంద్ర పెట్రోలియం, దక్షత అభివృద్ధి విభాగం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాష్ట్రంలో బలమైన నాయకుల జాబితాలో స్థానం సాధించారు.
ఇంతవరకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పలు సర్వేల్లో ఏకైక ప్రముఖునిగా కొనసాగారు. తాజా నివేదిక ఇద్దర్నీ ఒకే జాబితాలో చేర్చడంతో రాజకీయ శిబిరాల్లో సరికొత్త చర్చ పుంజుకుంది. వీరిద్దరితో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, ప్రధానమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి పి.కె. మిశ్రా రాష్ట్రంలో బలమైన అధికారులుగా తాజా జాబితాలో స్థానం సాధించడం విశేషం. ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక ప్రత్యేకంగా నిర్వహించిన సర్వేను పురస్కరించుకుని జాతీయస్థాయిలో 100 ప్రముఖ (బలమైన) వ్యక్తుల జాబితాను జారీ చేసింది.
రాష్ట్రం నుంచి 4గురు ప్రముఖులు తొలి 50 మందిలో స్థానం సాధించడం విశేషం. ఈ జాబితాలో రాష్ట్రానికి చెందిన వ్యక్తుల్లో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, ప్రధాన మంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి పి. కె. మిశ్రా ఉన్నారు.
జాతీయ స్థాయిలో 3వ స్థానం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా జాతీయ స్థాయిలో 100 మంది ప్రముఖుల జాబితాలో 3వ స్థానంలో నిలిచారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ జాబితాలో 30వ స్థానం దక్కించుకోవడం విశేషం. అవినీతి రహిత ముఖ్యమంత్రిగా ఆయన ఈ జాబితాలో స్థానం సాధించినట్లు నివేదిక పేర్కొంది. ఆయన ముఖ్యమంత్రిగా 17 ఏళ్ల పాలనలో పలు సందర్భాల్లో 44 మంది అవినీతి మంత్రుల్ని తొలగించారు.
2000వ సంవత్సరం నుంచి ఆయన నిరవధికంగా ముఖ్యమంత్రిగా పాలనాపగ్గాలు చేపడుతున్నారు. కేంద్ర పెట్రోలియం, దక్షత అభివృద్ధి విభాగం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ జాబితాలో 32వ స్థానం సాధించగా ప్రధానమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి పి.కె.మిశ్రా 44వ స్థానం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment