నిఘా నీడలో నీట్‌ | Neat in intelligence shadow | Sakshi
Sakshi News home page

నిఘా నీడలో నీట్‌

Published Mon, May 8 2017 2:31 AM | Last Updated on Tue, Sep 5 2017 10:38 AM

నిఘా నీడలో నీట్‌

నిఘా నీడలో నీట్‌

►  51 కేంద్రాల్లో ప్రశాంతంగా పరీక్ష
►  88 వేల మంది విద్యార్థుల హాజరు  
►  ఆంక్షలతో అవస్థలు
►  సేలంలో ముగ్గురు విద్యార్థులకు అనుమతి నిరాకరణ
►  విద్యార్థుల కన్నీటి వేదనతో జనంలో రగిలిన ఆక్రోశం
►  చొక్కాలు చింపుకున్నారు


సాక్షి, చెన్నై: వైద్య కోర్సుల ప్రవేశ నిమిత్తం రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష (నీట్‌) నిఘా నీడలో ఆదివారం జరి గింది. ఎనిమిది నగరాల్లోని 51 కేంద్రాల్లో ప్రశాంతంగా పరీక్ష సాగింది. 88 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. కట్టుదిట్టమైన ఆంక్షలు విద్యార్థులను తీవ్ర అవస్థలకు గురి చేశాయి. అనేక చోట్ల ఫుల్‌హ్యాండ్‌తో వచ్చిన విద్యార్థులు తమ చొక్కాలు చించుకోవాల్సిన పరిస్థితి.

ఎంబీబీఎస్, బీడీఎస్‌ వైద్య కోర్సుల ప్రవేశ నిమిత్తం జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష(నీట్‌)కు కేంద్రం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇక్కడ అమల్లో ఉన్న విద్యా విధానం మేరకు నీట్‌ నుంచి తమిళనాడుకు మినహాయింపు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరినా, అసెంబ్లీలో తీర్మానం చేసినా ఫలితం శూన్యం. ఈ విద్యా సంవత్సరం వైద్య కోర్సుల ప్రవేశ నిమిత్తం జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్షకు తప్పనిసరిగా విద్యార్థులు హాజరు కావాల్సిన పరి స్థితి. ఈ పరీక్షల నిమిత్తం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ముందస్తుగా హాల్‌ టికెట్ల పంపిణీ సాగింది.

ఆదివారం దేశ వ్యాప్త పరీక్షలో భాగంగా రాష్ట్రంలోనూ ఎనిమిది నగరాల్లోని కేంద్రాల్లో పరీక్షలకు ఏర్పాట్లు చేశారు. చెన్నై, కోయంబత్తూరు, తిరుచ్చి, మదురై, తిరునల్వేలి, నామక్కల్‌–సేలం, వేలూరు, పుదుచ్చేరి నగరాల్లో సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ నగరాల్లోని 51 కేంద్రాల్లో జరిగిన పరీక్షల నిమిత్తం ఉదయం ఏడు గంటలకే విద్యార్థుల తరలివచ్చారు. ఆయా కేంద్రాల్లో ఏడున్నర గంటల నుంచి బృందాలుగా విద్యార్థులను లోనికి అనుమతించారు. çహాల్‌ టికెట్ల పరిశీలనతో పాటు విద్యార్థుల వద్ద కనీసం పెన్నుకూడా లేకుండా చూసుకున్నారు. అయితే, కట్టుదిట్టమైన ఆంక్షల గురించి విద్యార్థులకు ముందుగా వివరించకపోవడంతో అవస్థలు తప్పలేదు.

ఆంక్షలతో అవస్థలు:  విద్యార్థినుల మెడలో ఉన్న చైన్‌లు, చెవి పోగులు, కాలి పట్టీలు, రబ్బర్‌ బ్యాండ్‌లను సైతం తీసి వేశారు. వాచీలు, షూలు ధరించిన వచ్చిన వాళ్లను వెనక్కు పంపించి, వాటన్నింటిని తొలగించినానంతరం లోనికి అనుమతించారు. ఇక ఫుల్‌హ్యాండ్‌ చొక్కాలతో వచ్చిన విద్యార్థులకు తంటాలు తప్పలేదు. ఆయా కేంద్రాల వద్ద ఆఫ్‌ హ్యాండ్‌గా చించుకుని లోనికి వెళ్లాల్సిన పరిస్థితి. కట్టుదిట్టమైన ఆంక్షలు, భద్రత ఏర్పాట్ల నడుమ విద్యార్థులు కేంద్రాల ఆవరణల్లోకి అడుగుపెట్టారు. గంట పాటు ఆవరణల్లో కూర్చోబెట్టి విద్యార్థులకు పర్యవేక్షకులు పలు సూచనలు ఇచ్చారు.

ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఉన్నాయా అని ప్రత్యేక పరికరాల ద్వారా తనిఖీలు చేయడం గమనార్హం. ఇక, సరిగ్గా 9.30 గంటలకు కేంద్రంలోని పరీక్షా గదుల్లోకి విద్యార్థులను అనుమతించారు. అందరికీ పెన్నులు పంపిణీ చేశారు. అరగంట పాటు విద్యార్థులు ఓఎంఆర్‌ షీట్‌ పూర్తి చేయడానికి సమయం కేటా యించారు. ఫొటోల పరిశీలన, ఎవరైనా విద్యార్థి అదనంగా ఫొటో లేకుండా పరీక్షా కేంద్రంలోకి వచ్చి ఉంటే, వారిని గుర్తించి అక్కడికక్కడ ఫొటోలు తీసి ఇచ్చారు. ఇందుకుగాను రూ.50 వసూలు చేయడం గమనార్హం. సరిగ్గా పది గంటలకు ప్రశ్నా పత్రాలు అందజేశారు.

ముగ్గురు విద్యార్థులకు అనుమతి నిరాకరణ:  
ఉదయం 9.30 తర్వాత పరీక్షా కేంద్రం వైపుగా వచ్చిన ఏ ఒక్కర్నీ లోనికి అనుమతించ లేదు. ధర్మపురి నుంచి ముగ్గురు విద్యార్థులు అతి కష్టం మీద సేలంలోని కేంద్రం వద్దకు చేరుకున్నా, ఫలితం శూన్యం. 9.35 గంటలకు వాళ్లు రావడంతో లోనికి అనుమతించ లేదు. దీంతో ఆ విద్యార్థులు కన్నీటి పర్యంతంతో అక్కడి అధికారుల్ని వేడుకున్నా ఫలితం శూన్యం. దీంతో ఆ పరిసరాల్లో ఉన్న ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఆ కేంద్రం అధికారులతో వాగ్వి వాదానికి దిగారు. ప్రశ్నాపత్రాలు ఇవ్వడానికి సమయం ఉంది కదా అని ప్రశ్నించారు. ఎంతకూ అధికారులు పట్టించుకోకపోవడంతో విద్యార్థులకు మద్దతుగా ఆందోళన సాగింది. పోలీసులు రంగంలోకి దిగి బుజ్జగించారు. అయినా ప్రయోజనం లేదు. చివరకు ఆ ముగ్గురు విద్యార్థులు కన్నీటి పర్యంతంతో ధర్మపురికి తిరుగు పయనమయ్యారు.

ప్రశాంతంగా పరీక్ష :
సేలం ఘటన మినహా తక్కిన అన్ని చోట్ల  పకడ్బందీగా, లీక్‌లకు ఆస్కారం లేని రీతిలో నిఘా నీడలో ఒంటి గంట వరకు పరీక్ష సాగింది. తమ పిల్లలు పరీక్షలకు వెళ్లడంతో తల్లిదండ్రులు ఆ పరిసరాల్లో ఉదయం నుంచి ఉత్కంఠగా వేచి ఉన్నారు. ఆయా పరీక్షా కేంద్రాల పరిసరాల్లోనూ భద్రత కట్టుదిట్టం చేయడంతో ఏదేని కొనుగోలు చేయాలన్నా కొంత దూరం నడక సాగించక తప్పలేదు. పుదుచ్చేరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా 88 వేల మంది విద్యార్థులు తమ ఉన్నత చదువు కలల్ని సాకారం చేసుకోవడం లక్ష్యంగా పరీక్షలకు హాజరయ్యారు. చెన్నైలో అయితే, 13 కేం ద్రాల్లో పరీక్షలు జరిగాయి.

ఆయా ప్రాంతాల్లోని కేంద్రాల వద్దకు ఉదయాన్నే పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు, తమ పిల్లల్ని వెంట బెట్టుకుని చేరుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆంక్షల మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముందుగా ఆంక్షల గురించి హాల్‌ టికెట్‌తో పాటు వివరించి ఉండాలని, ఇప్పుడు విద్యార్థుల్లో ఆందోళన రేకెత్తించే విధంగా ఆంక్షలు విధించారని ధ్వజమెత్తారు. పరీక్షల అనంతరం అనేక మంది విద్యార్థుల సులభతరంగా ఉందని వ్యాఖ్యానించగా, మరి కొందరు పర్వాలేదని సమాధానం ఇచ్చారు. ఇక, రాష్ట్రంలోని మెట్రిక్యులేషన్‌ స్కూళ్లల్లో చదువుకుని పరీక్షలకు హాజరైన విద్యార్థులు అయితే, తమకు ఏమీ అర్థం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement