
‘నీట్’పై నిప్పులు
నీట్ ప్రవేశపరీక్ష నుంచి తమిళనాడును మినహాయించాలని డిమాండ్ చేస్తూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి, ప్రజా సంఘాలు ఉద్యమించాయి
► ఉద్యమించిన విద్యార్థి సంఘాలు
► వేలాది మంది అరెస్ట్
► మెరీనాబీచ్ వద్ద నిషేధాజ్ఞలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: నీట్ ప్రవేశపరీక్ష నుంచి తమిళనాడును మినహాయించాలని డిమాండ్ చేస్తూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి, ప్రజా సంఘాలు ఉద్యమించాయి. రోడ్లపై బైఠాయించి నిరసనలు వ్యక్తం చేయడంతో వేలాదిమందిని పోలీసులు అరెస్ట్‌చేశారు. వైద్యవిద్య సీట్ల భర్తీకి నీట్ ప్రవేశ పరీక్షను కేంద్రం తప్పనిసరి చేసింది. నీట్ వల్ల తాము నష్టపోతామంటూ విద్యార్థులు అభ్యంతరం వ్యక్తంచేశారు. మినహాయింపు సాధిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రత్యేక ఆర్డినెన్స్‌ను కూడా తెచ్చింది.
అయితే ఈ ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి ఆమోదముద్ర పడలేదు. సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ కూడా వీగిపోయింది. తమిళనాడుకు నీట్ తప్పనిసరి కావడంతో అరియలూరు జిల్లాకు చెందిన అనిత వైద్య విద్య సీటును దక్కించుకోలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాష్ట్రంలో ఆందోళనలను రగిల్చింది. గత ఐదు రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్న విద్యార్థులు బుధవారం సైతం ఉద్యమానికి దిగారు.
తరగతులను బహిష్కరించి ప్లకార్డులను చేతబట్టి పాఠశాలలు, కళాశాలల ముందు బైఠాయించారు. రోడ్డు కూడళ్లలో రాస్తారోకోలు చేశారు. అనేకచోట్ల మానవహారాలు ఏర్పాటుచేసి నిరసన ప్రకటించారు. సుప్రీం కోర్టు తీర్పును అనుసరించే వైద్యవిద్య సీట్లను భర్తీ చేస్తున్నామని సీఎం ఎడపాడి ప్రకటించి విద్యార్థులను శాంతింపజేసే ప్రయత్నంచేశారు. పీఎంకే యువజన విభాగం అధ్యక్షులు, ఎంపీ అన్బుమణి రాందాస్, తమాకా అధ్యక్షులు జీకేవాసన్ ఉద్యమానికి మద్దతు తెలిపారు.
అమ్మ సమాధి వద్ద ..
రాష్ట్రంలో ఎలాంటి ఉద్యమం తలెత్తినా ప్రభుత్వానికి జల్లికట్టు ఉద్యమం, మెరీనాబీచ్ ప్రాంతం కళ్లలో మెదులుతోంది. నీట్ ఉద్యమకారులు మెరీనాబీచ్‌కు ఎక్కడ చేరుకుంటారోనని పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటుచేశారు. గుంపులు చేరకుండా నిషేధాజ్ఞలు సైతం విధించారు. అనుమానితులను ఆవైపునకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. అయితే కొందరు విద్యార్థులు బుధవారం సాయంత్రం పోలీసుల కళ్లుగప్పి మెరీనాబీచ్‌లోని అమ్మ సమాధి వద్దకు చేరుకున్నారు. నీట్ నుంచి మినహాయింపు దక్కేలా చూడాలని ప్రార్థనలు చేశారు. విద్యార్థుల రాకను ఆలస్యంగా తెలుసుకున్న పోలీసులు హడావుడిగా అక్కడికి చేరుకుని వారిని అరెస్ట్ చేశారు.
అసభ్య పోలీసు అధికారి
కోయంబత్తూరులో మంగళవారం నీట్ ప్రవేశపరీక్ష వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న వారిని అదుపుచేస్తున్న మహిళా ఎస్‌ఐ పట్ల ఒక పోలీసు ఉన్నతా«ధికారి అభ్యంతరకరమైన రీతిలో తాకుతున్న వీడియో వైరల్‌గా మారి కలకలం రేపింది. ఆందోళనకారుల తోపులాటను అవకాశంగా తీసుకున్న ఆ పోలీసు అధికారి పదేపదే మహిళా ఎస్‌ఐని తాకడం, ఆమె అనేకసార్లు నెట్టివేసినా కొనసాగిస్తున్న అసభ్యకరమైన దృశ్యాలు పోలీసుశాఖలో చర్చకు దారితీశాయి.