
కుటుంబ సభ్యులతో జ్యోత్స్న
విజయనగరంఅర్బన్ : తండ్రిని కోల్పోయిన సమయంలోనే ఇంటర్ వార్షిక పరీక్షలు రాసింది. ఆ వెంటనే నీట్ పరీక్షలు రాసింది. ఏ మాత్రం మానసిక ధైర్యాన్ని కోల్పోలేదు. పుట్టెడు దుఃఖంలోనూ పరీక్షలు రాసి నీట్‌లో మంచి ర్యాంక్ సాధించి శషభాష్ అనిపించుకుంది గంట్యాడ మండలం రేగుబిల్లికి చెందిన చప్ప జ్యోత్స్న. విద్యార్థిని తండ్రి రామకృష్ణ జామి మండలం కొట్టాం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. జ్యోత్స్య ఇంటర్ పరీక్షలు రాస్తున్న సమయంలోనే గుండెపోటుతో ఆయన మృతి చెందారు. తండ్రిని కోల్పోయినా అతని ఆశయాన్ని బతికించాలనే లక్ష్యంతో కష్టపడి చదివిన జ్యోత్స్న నీట్‌లో రాష్ట్రస్థాయిలో 322వ ర్యాంక్ (జాతీయ స్థాయిలో 5,817) సాధించింది. ఈ సందర్భంగా జ్యోత్స్న మాట్లాడుతూ, తండ్రి ఆశయం మేరకు డాక్టర్‌గా స్థిరపడతానని తెలిపింది.