వివేకంపై విమర్శలా?
తమిళసినిమా: వివేకం చిత్రంపై నెటిజన్ల విమర్శలను సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. నటుడు అజిత్ కథానాయకుడిగా నటించిన చిత్రం వివేకం. కాజల్‌అగర్వాల్ నాయకిగా కమలహాసన్ రెండవ కూతురు అక్షరహాసన్ కీలక పాత్రలో నటించిన వివేకం చిత్రాన్ని శివ దర్శకత్వంలో సత్యజ్వోతి ఫిలింస్ సంస్థ నిర్మించింది. చిత్రం గత 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మిశ్రమ స్పందనతోనూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. వివేకం చిత్రం మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు వసూల్ చేసినట్లు సమాచారం. చిత్రంలో కొన్ని అసహజ సన్నివేశాలు చోటుచేసుకున్నా, నటుడు అజిత్ ఈ చిత్రంలో అంకిత భావంతో నటించిన తీరును, అందుకు పడిన కఠిన శ్రమను అందరూ ముక్త కంఠంతో ప్రశంసిస్తున్నారు.అదే విధంగా ఛాయాగ్రాహకుడి నైపుణ్యం, గ్రాఫిక్స్ సన్నివేశాలు, పోరాట దృశ్యాలు, ఛేజింగ్ దృశ్యాలు హాలీవుడ్ చిత్రాల స్థాయిల్లో ఉన్నాయంటూ పలువురు అభినందిస్తున్నారు.
కలెక్షన్ల రికార్డులు : ఇక వివేకం చిత్రం కలెక్షన్ల పరంగా రికార్డులను బద్దలు కొడుతోంది. ఈ చిత్రం విడుదలైన తొలిరోజునే ప్రపంచ వ్యాప్తంగా రూ.33 కోట్లు వసూలు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. తమిళనాడులోనే రూ. 17 కోట్లు కలెక్ట్ చేసింది. ముఖ్యంగా చెనైలో వివేకం చిత్రం కబాలి చిత్ర రికార్డును బద్దలు కొట్టిందని సమాచారం. రెండు రోజుల్లో రూ.66 కోట్లు, మూడు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిందంటున్నారు.
తీవ్ర విమర్శలు: అయితే ఇప్పుడు చిత్రం విడుదలైన కొన్ని గంటలకే విమర్శల పేరుతో నెటిజన్లు వీడియో రూపంలో ఏకిపారేస్తున్నారు. కొందరైతే చిత్రాలను చూడకుండానే నటులపైనో, చిత్ర యూనిట్‌పైనో వ్యక్తిగత ద్వేషాలతో తీవ్రంగా విమర్శలు చేయడం ప్రారంభించారు. అలాంటి విమర్శకులు వివేకం చిత్రాన్ని వదలలేదు. కొందరు చిత్రాన్ని చూడకుండానే అజిత్‌ను, చిత్ర యూనిట్‌ను లక్ష్యంగా చేసుకుని ఇష్టం వచ్చినట్లు విమర్శించిన వీడియోలను చూసిన సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు.
అజిత్ శ్రమకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను
వివేకం చిత్రంపై వస్తున్న విమర్శలకు స్పందించిన నటుడు, నృత్యదర్శకుడు లారెన్స్ వివేకం చిత్రానికి అజిత్ పడిన శ్రమకు శిరసు వంచి నమస్కరిస్తున్నాన్నన్నారు. వివేకం చిత్రంపై కొందరు కావాలనే విమర్శనలు చేస్తుండడం బాధ కలిగిస్తోందన్నారు. చిత్రంలో అబ్బురపరచే పలు సన్నివేశాల గురించి వారు మాట్లాడలేదని, అలాంటి వారికి విమర్శించే అర్హత లేదని పేర్కొన్నారు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని లారెన్స్ అన్నారు. అదే విధంగా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి చిత్రాలను నిర్మిస్తున్నారని, అలాంటి చిత్రాలను చూడాలా? వద్దా?అన్నది ప్రేక్షకుల నిర్ణయానికే వదిలేయాలని నటుడు, సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ అభిప్రాయపడ్డారు.దర్శకుడు, ఛాయాగ్రాహకుడు విజయ్ మిల్టన్ కూడా వివేకం చిత్రంపై విమర్శలను ఖండిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు.