కొత్త ‘జాబితా’ సిద్ధం:ఈసీ
Published Thu, Apr 10 2014 1:32 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
సాక్షి, చెన్నై : రాష్ర్టంలోని 39 లోక్ సభ స్థానాలకు ఈనెల 24న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్న ఆశయంతో ఎన్నికల యంత్రాంగం ముందుకెళుతోంది. ఆ మేరకు ఇప్పటి వరకు రాష్ట్రంలో 5 కోట్ల 37 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2 లక్షల 69 వేల మంది పురుషులు, 2 కోట్ల 68 లక్షల మంది స్త్రీలు ఉన్నారు. ఇతరులు 2,996 మంది ఉన్నారు. అందరికీ అవకాశం ఇవ్వాలన్న లక్ష్యంతో కొత్త ఓటర్ల చేర్పు నిమిత్తం ప్రత్యేక శిబిరాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గత నెల ఏర్పాటు చేశారు. 60,418 కేంద్రాల్లో ఏర్పాటు చేసిన శిబిరాలకు అనూహ్య స్పందన వచ్చింది. నామినేషన్ పర్వం ముగిసేందుకు పది రోజుల ముందు వరకు కొత్త ఓటరుగా నమోదు చేసుకోవచ్చని అర్హులైన వారికి సూచించారు. గత నెల 25వ తేదీ వరకు కొత్త ఓటర్ల చేర్పునకు దరఖాస్తులను స్వీకరించారు.
12 లక్షల మందికి అవకాశం: ఎన్నికల కమిషన్ పిలుపుతో 13 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అయితే, ఇందులో లక్ష దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యా యి. సరైన చిరునామాలు, వివరాలు లేకపోవడం, జనన ధృవీకరణ పత్రాలు అస్తవ్యస్తంగా ఉండడం వెరసి వీటిని తిరస్కరించారు. పన్నెండు లక్షల దరఖాస్తులు పరిగణనలోకి తీసుకున్నారు. ఆ దరఖాస్తుల్లోని అర్హులైన వారి పేర్లను కంప్యూటర్లలో ఎక్కించే పనులు వేగవంతం చేశారు. 12 లక్షల మంది కొత్త ఓటర్ల చేర్పునకు అన్ని చర్యలు తీసుకున్నారు. దీంతో అనుబంధ ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు.
కొత్త ఓటర్లతో కూడిన అనుబంధ ఓటర్ల జాబితాను బుధవారం రాత్రికి లేదా, గురువారం ఉదయం ఆయా జిల్లా కేంద్రాల్లో విడుదల చేయడానికి చర్యలు తీసుకున్నారు. తమ పేర్లు అనుబంధ జాబితాలో ఉన్నాయా? అని తెలుసుకునేందుకు ప్రత్యేక ఎస్‌ఎంఎస్ సౌకర్యాన్ని కల్పించి ఉన్నారు. ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్‌కుమార్‌ను కదిలించగా, అనుబంధ ఓటర్ల జాబితా సిద్ధం అయిందన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు దీనిని విడుదల చేస్తారని పేర్కొన్నారు. తమ పేర్లు జాబితాలో ఉన్నాయా? అని తెలుసుకోవాలనుకునే వాళ్లు 9444123456 నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ పంపించి వివరాలు సేకరించుకోవచ్చని సూచించారు. చెన్నైలో అత్యధికంగా లక్ష మందికి పైగా కొత్త ఓటర్లు ఉన్నట్టు, ఇందులో వేళచ్చేరిలో ఎక్కువగా నమోదైనట్టు ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు.
Advertisement