నోయిడా, గ్రేటర్ నోయిడాకి సంబంధించి 2015-16 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను నోయిడా మెట్రో రైల్ కంపెనీ(ఎన్‌ఎమ్‌ఆర్‌సీ) ప్రవేశపెట్టింది.
నోయిడా: నోయిడా, గ్రేటర్ నోయిడాకి సంబంధించి 2015-16 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను నోయిడా మెట్రో రైల్ కంపెనీ(ఎన్‌ఎమ్‌ఆర్‌సీ) ప్రవేశపెట్టింది. దేశ రాజధాని నగరంలో జరిగిన బోర్డు సమావేశంలో నోయిడా, గ్రేటర్ నోయిడా ప్రాజెక్టుల కోసం రూ. 870 కోట్లను ఎన్‌ఎమ్‌ఆర్‌సీ కేటాయించింది. అలాగే నోయిడా, గ్రేటర్ నోయిడా అథారిటీలతో క్యాష్ ఇన్‌ఫ్యూషన్, ఈక్విటీ షేరింగ్ అగ్రిమెంట్ కోసం జరిగిన ఒప్పందానికి కూడా ఆమోదం లభించింది. తద్వారా డిస్కౌంట్ ధరకే కొత్త షేర్లను కొనుక్కునేందుకు షేర్ హోల్డర్లకు అవకాశం లభిస్తుంది. ఎన్‌ఎమ్‌ఆర్‌సీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జీపీ సింగ్ మాట్లాడుతూ నోయిడా-గ్రేటర్ నోయిడా మెట్రో నిర్మాణ పనులకు మొత్తం రూ. 5,500 కోట్లు వ్యయం అవుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు 2017 నాటికి పూర్తి కావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో ప్రస్తుతం ప్రాజెక్టు పురోగతిని సమీక్షించినట్లు సమాచారం. అంతేకాకుండా మెట్రో డిపోకి సంబంధించిన టెండర్లును కూడా ఆమోదించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పనులు ఈ నెలాఖరులో ప్రారంభం కానున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంజన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జంట నగరాల్లోని మెట్రో లింకులను కలుపుతూ ఏర్పాటు చేయాల్సిన రవాణా సౌకర్యాలపైనా చర్చించారు. మొత్తం 13 మార్గాల్లో 400 బస్సులు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు సమాచారం. ‘అంతర్జాతీయ ప్రమాణాలతో బస్సులను అందించే సంస్థను అతి త్వరలోనే నిర్ణయిస్తాం.
ఆ యాజమాన్యమే మెట్రో బస్సులను కూడా నడిపిస్తారు’ అని రంజన్ తెలిపారు. ఆటోమేటెడ్ ఫేర్ కలెక్షన్ (ఏఎఫ్‌సీ) వ్యవస్థను ఆమోదించారు. ఈ వ్యవస్థను ప్రవేశపెడితే ప్రయాణికులకు ఒక స్మార్ట్ కార్డు ఇస్తారు. దీనితో మెట్రో రైలుతోపాటు బస్సుల్లోనూ ప్రయాణించవచ్చు. ఈ కార్డుని ఉపయోగించి ప్రయాణికులు నగరం మొత్తం సులభంగా ప్రయాణింవచ్చని మెట్రో అధికారులు తెలిపారు. అలాగే ఉద్యోగుల నియామకం, క్రమశిక్షణ నియమాలు, భత్యం తదితర వాటికి అవలంభించాల్సిన విధానాలకు కూడా ఈ సమావేశంలో ఆమోదం లభించింది.