
పటేల్‌కు న్యాయం జరగలేదు
న్యూఢిల్లీ: సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు చరిత్రలో న్యాయం జరగలేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. శనివారం ఇక్కడ తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘దేశ సమైక్యతకు, సంస్థానాల విలీనానికి, స్వాతంత్య్రానంతరం దేశంలో శాంతి నెలకొల్పేందుకు పటేల్ చేసిన కృషిని నేడు దేశం స్మరించుకుంటోంది.
దేశ తొలి ప్రధానిగా పటేల్ అయి ఉంటే దేశ ప్రగతి వేరేలా ఉండేదని దేశ ప్రజల భావన. పటేల్ పట్ల ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడం దురదృష్టకరం. చరిత్రలో చాలా మంది నాయకులకు తగిన గుర్తింపు లభించలేదు. దేశం కోసం కృషిచేసిన నాయకులను దేశానికి ప్రస్తుతం తెలియపరుస్తున్నాం..’ అని పేర్కొన్నారు. ‘సర్దార్ పటేల్ కాంగ్రెస్ నాయకుడు కాదు. ఆయన జాతీయ నాయకుడు. పటేల్ జయంతిని కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది..’ అని పేర్కొన్నారు.