ముంబై సమగ్రాభివృద్ధి కోసమే కమిటీ | No one can separate Mumbai from Maharashtra: Devendra Fadnavis tells Council | Sakshi
Sakshi News home page

ముంబై సమగ్రాభివృద్ధి కోసమే కమిటీ

Published Wed, Dec 24 2014 11:01 PM | Last Updated on Sat, Sep 2 2017 6:41 PM

No one can separate Mumbai from Maharashtra: Devendra Fadnavis tells Council

నాగపూర్: దేశ ఆర్థిక రాజధానిగా విరాజిల్లుతున్న ముంబై నగరాన్ని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని ఆధ్వర్యంలో నగర అభివృద్ధి కమిటీ ఏర్పాటుకు తాను ప్రతిపాదించానని ఆయన నొక్కి చెప్పారు. విధాన మండలిలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. ముంబై అభివృద్ధికి కమిటీ ఏర్పాటు విషయమై ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం సృష్టిస్తున్నాయని అన్నారు.

ముంబై నగరం ఎన్నటికీ మహారాష్ట్రలో భాగంగానే ఉంటుందని, దాన్ని ఎవరూ రాష్ట్రం నుంచి వేరుచేయలేరని ఆయన ప్రకటించారు. నగ రం ఇప్పటికే అభివృద్ధి చెందినప్పటికీ, మరింత సమగ్ర అభివృద్ధి సాధించడం ద్వారా ప్రపంచంలోనే మేటి నగరంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం సంకల్పించిందన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతో అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. నగరంలో చేపట్టే పలు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి శీఘ్రగతిన ఆమోదాలు పొందాలంటే ప్రధాని స్థాయి వ్యక్తిని నగర అభివృద్ధిలో భాగస్వామ్యులను చేయడం ఉత్తమ మార్గమని తాము తలచినట్లు వివరించారు. కాగా, బృహన్ ముంబై నగర పాలక మండలి (బీఎంసీ) ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు వంటి జిమ్మిక్కులు చేస్తోందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ విమర్శించిన సంగతి తెలిసిందే.

ముంబై అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని, దీనిలో ప్రధాని పాత్ర అనవసరమని ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కాగా, ముంబైలో మౌలిక వసతులను అభివృద్ధి చేయడం ద్వారా నగరవాసుల జీవవ ప్రమాణాలను మెరుగుపరచడం తమ లక్ష్యమన్నారు. ప్రపంచ దేశాలనుంచి నగరానికి పెట్టుబడులను ఆహ్వానించేందుకు తగిన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందన్నారు. పెట్టుబడుదారులకు అవసరమైన అనుమతులను శీఘ్రగతిన అందజేసేందుకు కేంద్రం సాయంకూడా చాలా అవసరమన్నారు.

దీని కోసమే తమ ప్రభుత్వం ప్రధాని ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటుకు సూచించిందని చెప్పారు. కాగా, దీనిపై కాంగ్రెస్ నేత మాణిక్‌రావ్ ఠాక్రే స్పందిస్తూ.. నగర సమగ్రఅభివృద్ధి కమిటీ ఏర్పాటుచేస్తే దానికి సాధారణంగా ముఖ్యమంత్రి నాయకత్వం వహిస్తారు.. అయితే ప్రధానిని ఈ కమిటీకి నాయకత్వం వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడం సమంజసమేనా.. అంటూ ప్రశ్నించారు. దీనికి ఫడ్నవిస్ స్పందిస్తూ.. దేశంలో ఏ కమిటీకైనా ప్రధాని నేతృత్వం వహించవచ్చు.. అలాంటప్పుడు ఈ కమిటీ ఆయన నేతృత్వం వహిస్తే తప్పేంటని ఎదురు ప్రశ్నించారు.
 
మెట్రో లైన్లలో లోకల్ రైళ్లను నడిపేందుకు తమ ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. సాధ్యమైనంతమేరకు క్లోజ్డ్ డోర్ లోకల్ రైళ్లను నడిపేందుకు ప్రతిపాదన ఉందన్నారు. కాగా,హార్బర్ లైన్‌లో క్లోజ్డ్ డోర్ రైళ్లను ప్రయోగత్మకంగా నడపనున్నట్లు వెల్లడించారు. అది విజయవంతమైతే మిగిలిన లైన్లలో కూడా ఈ రైళ్లను నడిపిస్తామని వివరించారు. అలాగే వడాలా- సంత్ గాడ్గే మహరాజ్ చౌక్ మధ్య రెండో విడత మెట్రో పనులు వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు పూర్తిచేస్తామని సీఎం ప్రకటించారు. అయితే సీఎం ప్రకటన లోపభూయిష్టంగా , అసంపూర్ణంగా ఉందని విధాన మండలిలో ఎన్సీపీ నేత అయిన ధనంజయ్ ముండే విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement