సాక్షి, ముంబై: రాష్ట్రంలో ఓ ఊపు ఊపుతుందనుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి ప్రచార సారథులే కరువయ్యారు. ఇప్పటికే అధికార డీఎఫ్ కూటమి, మహా కూటమి ముఖ్య నేతలు ఎన్నికల ప్రచారాలు, రోడ్ షోలతో హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారాలకు రావడం ఆయా పార్టీలకు మంచి ఊపునిస్తున్నాయి. చిన్నాచితకా పార్టీలు కూడా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అదే ఆప్ పరిస్థితి మరోలా కనబడుతోంది. అసలే రాజకీయ అనుభవం లేని నేతలే పోటీ చేస్తుండటం, వారికి మార్గదర్శనం చేసేవారు కరువవడం ఆ పార్టీకి ప్రతికూలాంశంగా మారింది. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇటువైపుగా చూడకపోవడం ఆ పార్టీ నేతల్లో గుబులు రేపుతోంది.
తొలి దశ ఎన్నికలకు ముందు ఒకసారి తళుక్కున వచ్చి ప్రచారం చేసి వెళ్లిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇటువైపుగా చూడకపోవడంతో ఆ పార్టీ అభ్యర్థుల ప్రచారం చప్పగా సాగుతోంది. ప్రసంగాలు దట్టించే ఆప్ ప్రముఖ నేతలెవ్వరూ ఈ ఛాయలకు రాకపోవడంతో బరిలో దిగిన అభ్యర్థులే తమ ప్రచార కార్యక్రమాలు స్వయంగా చేపడుతున్నారు. నెల రోజుల క్రితం కేజ్రీవాల్ ముంబై, విదర్భలో చేపట్టిన ఒకట్రెండు రోడ్ షోలు, ప్రచార సభలవల్ల ఆప్ పార్టీకి కొంత హూషారు వచ్చింది. ఆ తర్వాత ఆ పార్టీ తరఫున ఇంతవరకు దిగ్గజాలెవరూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనలేదు. దీంతో బరిలో దిగిన ఆ పార్టీ అభ్యర్థులు బేజారవుతున్నారు. ఆప్ తరఫున బరిలో దిగిన అభ్యర్థుల్లో అత్యధిక శాతం మొదటిసారి పోటీ చేస్తున్నవారే ఉన్నారు.
వీరికి మార్గదర్శనం చేయడానికి అనుభవమున్న రాజకీయ నాయకులు కావా లి. వారికి మద్ధతుగా ఎన్నికల ప్రచారం జోరుగా చేయడానికి రాజకీ య అనుభవజ్ఞుల అవసరముంది. అయితే ఇక్కడ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. మేధాపాట్కర్, వామన్‌రావ్ చటప్, రఘునాథ్ పాటి ల్, మీరా సన్యాల్, అంజలీ దమానియా మినహా మిగతా అభ్యర్థులు ఇప్పటికీ అయోమయంలోనే ఉన్నారు. నెల రోజుల క్రితం కేజ్రీవాల్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి శంఖం పూరించిన తర్వాత మేధా పాట్కర్, అంజలి దమానియా ఇక్కడి ప్రచార బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. అయితే ఈశాన్య ముంబై నుంచి పాట్కర్‌కి, నాగపూర్ నుంచి పోటీచేస్తున్న అంజ లి దమానియాకు తీవ్ర పోటీ ఎదురవుతుండటంతో ఆయా ప్రాం తాలకే పరిమితం కావాల్సి వస్తోంది. దీంతో రాష్ట్రంలో ఆప్ తరఫున బడా నాయకులెవరూ తమ పార్టీ అభ్యర్థులకు అండగా నిలబడలేకపోతున్నారు. చేసేదేమీలేక జనాన్ని సమీకరించడం, సభల షెడ్యూలు రూపొం దించుకోవడం తదితర పనులతోపాటు ప్రచార సభలు, ర్యాలీలు, రోడ్‌షోలు ఆప్ అభ్యర్థులు నిర్వహిస్తున్నారు.
ఊపు లేని ఆప్ ప్రచారం
Published Sun, Apr 13 2014 10:28 PM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement