ముంబై: టోల్ రుసుం వసూలు నిలిపివేస్తే కొత్త రోడ్ల నిర్మాణం నిలిచిపోతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అన్నారు. బిడ్డింగ్ విధానం, టోల్ నగదు లెక్కింపుల్లో అవినీతి చోటుచేసుకుంటోందన్న సీఎం రెగ్యులేటరీ ఆథారిటీని ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. టోల్ ప్రక్రియ పారదర్శకంగా లేదని, దీనిపై ప్రజలు కొంత అసంతృప్తితో ఉన్న మాట వాస్తవమేని ఆదివారం సాయంత్రం మీడియాకు తెలిపారు. ఒకవేళ టోల్ పన్ను వసూలుచేయకపోతే హైవేలను నిర్మించడం సాధ్యం కాదని చెప్పారు. దీనికోసం రెగ్యులేటరీ ఆథారిటీని నెలకొల్పుతామని వివరించారు. నగర శివారుల్లో ప్రవేశ ద్వారాల వద్ద టోల్ రుసుం కట్టేందుకు కొల్హాపూర్ వాసులు నిరాకరిస్తుండటంపై ఆయన స్పందించారు. ఒప్పందం ప్రకారం టోల్ రుసుం వసూళ్లలో కంపెనీకి ఇబ్బందులు ఏర్పడితే ప్రభుత్వం ఆ నష్టపరిహారాన్ని చెల్లిస్తుందన్నారు. అయితే ప్రస్తుతం సర్కార్ వద్ద డబ్బు లేదని వివరించారు. టోల్‌రుసుంను చెల్లించవద్దంటూ మహారాష్ట్ర నవనిర్మా సేన అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే ఆదేశాల మేరకు ఆ పార్టీకి చెందిన కొంత మంది కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లోని టోల్‌నాకాల వద్ద సోమవారం హాల్‌చల్ సృష్టించారు. ధ్వంసం చేశారు.
‘రాజ్‌ఠాక్రేపై చర్యలు తీసుకోండి’
సాక్షి, ముంబై: టోల్ వసూళ్లపై ఎమ్మెన్నెస్ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగించిన ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్ ఠాక్రేపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌ను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే డిమాండ్ చేశారు. టోల్ చెల్లించకండి, డబ్బులు అడిగినవారిని ఉతికి ఆరే యండని రాజ్ రెచ్చగొట్టేలా మాట్లాడటం వల్ల సోమవారం వివిధ ప్రాంతాల్లో వారి పార్టీ కార్యకర్తలు దాడులకు దిగారని అన్నారు. రాష్ట్రంలో శాంతి, భద్రతలకు భంగం వాటిల్లేలా వ్యవహరించిన రాజ్‌పై చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు.
టోల్‌ప్లాజాలను ఎత్తేయండి: శివసేన, బీజేపీ
షోలాపూర్, న్యూస్‌లైన్: రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ శివసేన, బీజేపీ సోమవారం ఆందోళనకు దిగాయి. అక్కల్‌కోట్ రహదారిపై ఉన్న టోల్‌నాకా వద్ద కాషాయకూటమి నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో గుమిగూడారు. దీంతో ముందుజాగ్రత్త చర్యగా పోలీసు బలగాలను పెద్ద మొత్తంలో మోహరించారు. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న టోల్‌నాకా సిబ్బంది ఉదయం నుంచి కౌంటర్లను మూసివేశారు. దీంతో ఆస్తులకు నష్టం వాటిల్లలేదు. అయితే ఇరుపార్టీల నాయకులు టోల్ ఎత్తివేయాలని డిమాండ్‌చేశారు.
ఆ తర్వాత కొంతసేపటికి ఆందోళన విరమించారు. బీజేపీ ఎమ్మెల్యేలు విజయ్ దేశ్‌ముఖ్, సిద్రామప్ప పాటిల్, శివసేనకు చెందిన ప్రతాప్ చవాన్, విష్ణు కారంపూరి తదితరులు పాల్గొన్నారు. ఈ ఆందోళనలో ఎమ్మెన్నెస్ కార్యకర్తలు పాల్గొనలేదు. ఆందోళనకారులు వెళ్లిపోయిన తర్వాత మళ్లీ టోల్ వసూళ్లు యథాతధంగా కొనసాగించారు.
టోల్ లేకపోతే రోడ్ల నిర్మాణం ఆగినట్టే : పృథ్వీరాజ్ చవాన్
Published Mon, Jan 27 2014 11:45 PM | Last Updated on Tue, Aug 28 2018 3:57 PM
Advertisement