సాక్షి, చెన్నై: తమిళ సమాజాభ్యున్నతిని కాంక్షిస్తూ మహోద్యమానికి ప్రజలు సన్నద్ధం కావాలని డీఎంకే అధినేత ఎం కరుణానిధి పిలుపునిచ్చారు. ప్రజాహితమే లక్ష్యంగా, వారిలో చైతన్యం తీసుకురావడం ధ్యేయంగా ముందుకు సాగుదామన్నారు. నగరంలో గురువారం జరిగిన ఓ వివాహ వేడుకలో కరుణానిధి ప్రసంగిం చారు. సమాజంలో, సంప్రదాయాల్లో వస్తున్న మార్పుల గురించి ఇక్కడ ప్రసంగించిన వాళ్లందరూ ఆవేదన వ్యక్తం చేశారని తన ప్రసంగంలో కరుణానిధి గుర్తు చేశారు. సమాజ హితాన్ని, తమిళ ప్రజా సంక్షేమాన్ని పరిరక్షించే రీతిలో ప్రతి ఒక్కరూ అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సమాజం ఎటు వెళ్తున్నదోనని అన్వేషించకుండా, వెళ్లకుండా అడ్డుకునే మార్గాల మీద దృష్టి పెట్టాలని సూచించారు. తమిళుడు తమిళుడుగానే జీవించాలని పిలుపునిచ్చారు.
తమిళులందరూ ఒకే తాటిపై ఉంటే, ఏ శక్తీ అడ్డుకోలేదన్నారు. ఇందులో విజయం తమిళుడిదేనన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. తమిళుల మీద మరొకరు ఆధిపత్యం చెలాయించే స్థాయికి పరిస్థితుల్ని తీసుకెళ్ల కూడదని, ఏకతాటిపై ఉంటే తమిళుడి సత్తా ఏమిటో తెలిసి వస్తుందంటూ పరోక్షంగా బీజేపీ వేస్తున్న రాజకీయ ఎత్తుగడల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ఇతర పార్టీలకు తన ఆహ్వానాన్ని పంపించే విధంగా ఆ వ్యాఖ్యల్ని కరుణానిధి అందుకున్నట్టుగా అక్కడే ఉన్న డీఎంకే వర్గాలు ఈ సమయంలో గుస గుసలాడటం విశేషం. తమిళుల కోసం డీఎంకే పడ్డ శ్రమ, చేసిన కృషిని ఎలుగెత్తి చాటే సమయం వచ్చిందని, ప్రతి ఒక్కరూ ఆ దిశగా పయనించాలని పిలుపునిచ్చారు. తమిళ సమాజం పరిరక్షణ, అభ్యున్నతే ధ్యేయంగా, తమిళ సమాజ వికాసం కోసం మహోద్యమానికి ప్రజల్ని సన్నద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ శ్రమించాలని తమిళ సమాజాభ్యున్నతికి పాటుపడుదామని పిలుపు నిచ్చారు.
మౌనంగా ఉంటే మంచిదే: తన ప్రసంగం అనంతరం వెలుపలకు వచ్చిన కరుణానిధి మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ముల్లై పెరియార్, కావేరి తీరంలో డ్యాం నిర్మాణం గురించి సంధించిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, రాజకీయాలు చేస్తున్న వాళ్లు చేస్తూనే ఉన్నారని పరోక్షంగా అధికార పక్షాన్ని ఉద్దేశించి విమర్శించారు. అసెంబ్లీకి, కేబినెట్ సమావేశానికి పిలుపునివ్వాలని డిమాండ్ చేస్తే, పట్టించుకున్న వారు లేరంటూ, ఇక ఆ డ్యాంల విషయంలో ఏ మేరకు శ్రద్ధ చూపుతారని విమర్శించారు. అన్నాడీఎంకే సర్కారు వ్యవహారంతో పప్పు, నూనె కొనుగోళ్లపై ఆరోపణలు వస్తున్నాయే..? అని ప్రశ్నించగా, అవినీతా, నష్టమా అన్నది తేల్చండి ముందు అని చమత్కరించారు. సీఎం పన్నీరు సెల్వం తమరిని ఉద్దేశించి మౌనంగా ఉంటే మంచిదని హితవు పలికారే...? అని ప్రశ్నించగా, సీఎం.. ఎవరో...వాళ్లు మౌనంగా ఉంటే ప్రపంచానికీ, తమిళనాడుకు మంచిదే, కాబట్టి వాళ్లు ముందు మౌనంగా ఉంటే మంచిదంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు.
ఉద్యమానికి సన్నద్ధం కండి!
Published Fri, Nov 21 2014 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 PM
Advertisement