నాశనమై పోతారు | Internal feud in DMK upsets Karunanidhi | Sakshi
Sakshi News home page

నాశనమై పోతారు

Published Wed, Jan 14 2015 3:14 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 PM

నాశనమై పోతారు

నాశనమై పోతారు

సాక్షి, చెన్నై : డీఎంకేను నిర్వీర్యం చేయడానికి కుట్ర చేస్తున్న వాళ్లంతా నాశనమైపోతారు! అని ఆ పార్టీ అధినేత ఎం కరుణానిధి శాపనార్థాలు పెట్టారు. డీఎంకే ‘నా పార్టీ కాదు, మన పార్టీ’ అని వ్యాఖ్యానించారు. తన కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.  వరుస పతనాలతో డీలా పడ్డ డీఎంకేను కరుణానిధి మళ్లీ పూర్వ వైభవం తెచ్చే పనిలో పడ్డారు. అదే సమయంలో డీఎంకేకు వ్యతిరేకంగా మీడియాల్లో కథనాలు హల్‌చల్ చేస్తున్నాయి. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయని, కరుణానిధి కుటుంబంలో విబేధాలు తాండవం చేస్తున్నాయన్న ప్రచారం జోరందుకుంది. స్టాలిన్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించండంలో కరుణానిధి వెనక్కు తగ్గడం మరింత వివాదానికి ఆజ్యం పోసిందని, డీఎంకే మరింతగా చలికిలబడే స్థాయికి చేరిందన్న కథనాలు కరుణానిధిలో ఆగ్రహాన్ని తెప్పించాయి. తన కుటుంబం మీద, డీఎంకేకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రచారాలకు ముగింపు పలకడంతోపాటుగా ఆ కుట్రలు, కుతంత్రాలు చేస్తున్న వాళ్లపై శాపనార్థాలు పెట్టే పనిలో కరుణానిధి ఉన్నారు. ఇందుకు వేదికగా డీఎంకే తీర్మానాల విశదీకరణ సమావేశాన్ని నిర్వహించారు.

 గత వారం డీఎంకే సర్వసభ్య, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం చెన్నైలోని అన్నా అరివాలయంలో జరిగిన విషయం తెలిసిందే. ఇందులో కీలక తీర్మానాలు చేశారు. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా సభల నిర్వహణకు చర్యలు తీసుకుంది. ఈ సభలకు శ్రీకారం చుట్టే విధంగా సోమవారం రాత్రి మైలాపూర్‌లో బహిరంగ సభ జరిగింది. డీఎంకే అధినేత కరుణానిధి, ప్రధాన కార్యదర్శి అన్భళగన్, కోశాధికారి ఎంకే స్టాలిన్, నాయకులు దురై మురుగన్, సద్గున పండియన్, దక్షిణ చెన్నై డీఎంకే కార్యదర్శి అన్భళగన్ వేదిక మీద ఆశీనులయ్యారు. ఇందులో కరుణానిధి తన ఆక్రోశాన్ని వెల్లగక్కే రీతిలో ప్రసంగం చేశారు. డీఎంకేను నిర్వీర్యం చేయాలన్న కుట్రలు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంకేకు వ్యతిరేకంగా కుట్రలు, కుతంత్రాలు చేసే వాళ్లందరూ నాశనమవుతారని శాపనార్థం పెట్టారు. తాను ఏ సమయంలోనూ డీఎంకే నా పార్టీని, నా కళగం అని వ్యాఖ్యానించ లేదని, మన పార్టీ మన కళగం అని చెప్పుకునే వాడినన్నారు.

డీఎంకే ఎక్కడ బల పడుతుందోనన్న భయం కొందరిలో నెలకొందని, అందుకే మన పార్టీకి వ్యతిరేకంగా కుట్రలు కుత్రంతాలు రచించే పనిలో పడ్డారని ధ్వజమెత్తారు. ఎన్నో ఓటముల్ని ఎదుర్కొని మళ్లీ విజయపు బాటలో నడిచిన పార్టీ డీఎంకే అన్న విషయాన్ని ఆ దుష్ట శక్తులు గుర్తెరగాలని హితవు పలికారు. డీఎంకే వాల్ పోస్టర్ పార్టీ కాదని, స్వలాభం కోసం ఆవిర్భవించిన పార్టీ కూడా కాదని, ప్రకటనలు, పబ్లిసిటీతో పబ్బం గడుపుకునే పార్టీ కాదని, ద్రవిడుల జీవితాల్లో వెలుగు లక్ష్యంగా, ద్రవిడ ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుతున్న పార్టీ అన్న విషయాన్ని గ్రహించండంటూ హెచ్చరించారు.

విభేదాల్లేవు : తన కుటుంబంలో విబేధాలు తారా స్థాయికి చేరినట్టు, పార్టీ చీలబోతున్నట్టుగా కథనాలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా అలాంటివి మానుకోవాలని హెచ్చరించారు. లేకుంటే, తాను నిజాలు వెల్లడించాల్సి ఉంటుందని, పాత కాలపు కరణానిధిలా మారాల్సి ఉంటుందని శివాలెత్తారు. ఆనాటి కరుణానిధి గురించి గుర్తెరిగి ఉన్నారు కాదా, తాను మళ్లీ అదే బాణిలో పయనిస్తే తప్పులు, నిజాలన్నీ బయటకు వస్తాయని హెచ్చరించారు. తన కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని, అందరూ స్నేహ పూరిత వాతావరణంలో, ఆనందంగా ఉంటున్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. పార్టీ బలోపేతం, అధికారం లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలాగా శ్రమించి విమర్శకుల నోటికి కళ్లెం, కుట్రదారుల ఆగడాలకు అడ్డుకట్ట వేద్దామని ఈ సందర్భంగా పార్టీ వర్గాలకు కరుణానిధి పిలుపునిచ్చారు. తన ప్రసంగంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలపై కరుణానిధి తీవ్రంగానే స్పందించడం కొసమెరుపు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement