'ఇప్పుడు తీస్కో.. త్రీ బెడ్రూమ్ ఫ్లాట్..' | ‘Now take your 3BHK, Indrani said while strangling Sheena’ | Sakshi
Sakshi News home page

'ఇప్పుడు తీస్కో.. త్రీ బెడ్రూమ్ ఫ్లాట్..'

Published Sat, Sep 12 2015 11:28 AM | Last Updated on Sun, Sep 3 2017 9:16 AM

'ఇప్పుడు తీస్కో.. త్రీ బెడ్రూమ్ ఫ్లాట్..'

'ఇప్పుడు తీస్కో.. త్రీ బెడ్రూమ్ ఫ్లాట్..'

ఆ కారులో నలుగురున్నారు. తల్లిని బ్లాక్ మెయిల్ చేస్తున్న కూతురు.. ఊరుకుంటే కూతురే కోడలై తన ఆర్థిక ఆధిపత్యానికి చెక్ పెడుతుందనుకున్న తల్లి.. తన నుంచి విడిపోయాక బాగా బతుకుతున్న మాజీ భార్యతో లాభపడొచ్చనుకున్న భర్త.. డబ్బున్నోళ్లకు నమ్మినబంటుగా ఉంటే ఆర్థికంగా ఎదగొచ్చనుకున్న డ్రైవర్. అలా వారి ప్రయాణం సాగుతుండగానే..

తల్లి చేతులు  కూతురి మెడను చుట్టేశాయి. 'ఏమే.. నాకు పుట్టి నన్నే బెదిరిస్తావా.. త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్ అడుగుతావా.. ఇప్పుడు తీస్కోవే.. త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్..' అంటూ ఇంద్రాణి తన కూతురు షీనా గొంతు నులుముతుంటే.. కదలనివ్వకుండా గట్టిగా పట్టుకున్నాడు ఆమె రెండో భర్త సంజీవ్ ఖన్నా. ఆ సమయంలో కారు లోపలే ఉన్న డ్రైవర్ శ్యామ్ రాయ్ ...పోలీసుల విచారణలో షీనా బోరా హత్యకు సంబంధించిన పలు కీలక విషయాలను  వెల్లడించాడు.

ఆర్థికంగా అండ దొరుకుతుందనే ఆశే తప్ప షీనా హత్యకు సహకరించడం వెనుక ఎలాంటి ఉద్దేశాలు లేవని డ్రైవర్ శ్యామ్ రాయ్ పోలీసులకు తెలిపాడు. ఈ కేసులో మూడో నిందితుడిగా ఉన్న అతడు అప్రూవర్ గా మారతాడన్నది తాజా సమాచారం. సాధ్యమైనంతమేరలో శిక్ష నుంచి తప్పించుకోవాలని భావిస్తున్న శ్యామ్.. అప్రూవర్ గా మారాలనుకుంటున్నాడని, దీంతో గడిచిన నెల రోజులుగా సంచలనాలు సృష్టించిన షీనా హత్యకేసు ఓ కొలిక్కి వచ్చినట్లేనని ముంబై పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. పోలీసులు తెలిపిన మరికొన్ని వివరాలు..


కుబేరుడైన పీటర్ ముఖర్జియా జీవితంలోకి మూడో భార్యగా ప్రవేశించినప్పటికీ ఆయనపై ఇంద్రాణి ముఖర్జీయా పూర్తి ఆధిపత్యాన్ని చలాయించేది. ఆర్థిక విషయాలన్నీ ఆమె కనుసన్నల్లోనే సాగేవి. అలాంటిది.. పీటర్ కుమారుడు రాహుల్ ను షీనా పెళ్లి చేసుకుంటే గనుక ఆ కుటుంబ ఆస్తులపై పట్టు కోల్పోతాననే భయం ఇంద్రాణిని వెంటాడింది. అందుకే రాహుల్ తో రిలేషన్ కట్ చేసుకోవాలని షీనాపై ఒత్తిడి తెచ్చింది.


షీనా మాత్రం ఇంద్రాణి ఒత్తిళ్లకు బెదరలేదు సరికదా.. రివర్స్ లో తల్లినే బ్లాక్ మెయిల్  చేయడం మొదలుపెట్టింది. 'నీ గత జీవితానికి సంబంధించిన వివరాలన్నీ రాహుల్, పీటర్ లకు చెప్పేస్తా. నీ చెల్లెలిగా వారు నా మాట నమ్ముతారు' అని హెచ్చరించేది. మాట్లాడకుండా ఉండాలంటే ప్రస్తుతానికి బంద్రా హిల్స్ లో త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్ తనకు కొనివ్వాలని డిమాండ్ చేసింది. ఒకవేళ షీనాకు ఫ్లాట్ కొనిచ్చినప్పటికీ మళ్లీ తనను బ్లాక్ మెయిల్ చేయకుండా ఉండదనే అపనమ్మకంతో  తీవ్రంగా ఆలోచించిన ఇంద్రాణి.. షీనాను అడ్డు తొలిగించుకోవడం ఒక్కటే దారి అని బలంగా విశ్వసించింది. అందుకే తన స్వహస్తాలతో కన్న కూతురినే కడతేర్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement