
సాక్షి, తమిళనాడు : మట్టిలో పాతి పెట్టిన రూ.35 వేల నోట్లు చెల్లవని తెలుసుకుని ఓ దివ్యాంగురాలు ఆవేదనకు లోనైన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. నాగై జిల్లా సిర్కాలి సమీపంలో ఉన్న పట్టియమేడు గ్రామానికి చెందిన రాజ (58) కూలీ కార్మికుడు. ఇతని భార్య ఉష (52). వీరి కుమార్తె విమల (17). తల్లీ, కుమార్తెకు మాటలురావు. మహాత్మాగాంధీ జాతీయ పథకం కింద పనికి వెళుతూ వచ్చారు. పది సంవత్సరాలుగా తన కుమార్తె వివాహం కోసం రూ.1000, రూ.500 నోట్లని రూ.35,500 వరకు కొంచెంకొంచెంగా ఉషా చేర్చిపెట్టింది. ఆ నోట్లను ఒక ప్లాస్టిక్ సంచిలో భద్రంగా చుట్టి దాంతో ఒక గ్రాము బంగారు బిస్కెట్‌ను పెట్టి తన భర్తకు తెలియకుండా ఇంటి వెనుక భాగంలో గుంత తవ్వి పాతి పెట్టింది.
2016లో కేంద్ర ప్రభుత్వం పాత వెయ్యి రూపాయల నోట్లు, రూ.500 నోట్లు చెల్లవని ప్రకటించింది. ఈ విషయం తల్లి, కుమార్తె తెలుసుకోలేకపోయారు. రాజదురై తన గుడిసె ఇంటిని రాష్ట్ర ప్రభుత్వం నిధి సహాయంతో ఇటుకల ఇంటిని కట్టే పథకంలో అనుమతి పొంది ఇల్లు కట్టే పనిని ప్రారంభించారు. ఈ పని కోసం శుక్రవారం కార్మికులు ఇంటి వెనుక భాగంలో తవ్వినప్పుడు, నగదు చిక్కింది. ఆ నగదు తన కుమార్తె వివాహం కోసమే చేర్చి పెట్టినట్లుగా సైగ ద్వారా ఉషా తెలిపింది. అప్పుడు కార్మికులు ఈ నగదు నోట్లు చెల్లవు అని, కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లకు ముందే ప్రకటించిందని తెలిపారు. ఈ విషయం తెలుసుకొని దిగ్భ్రాంతితో తల్లి, కుమార్తె అలాగే నిలబడి పోయారు. తన కుమార్తె వివాహానికి ఏంచేయాలో తెలియలేదని, తమిళ రాష్ట్ర ప్రభుత్వం రూపాయి నోట్లను మార్చడానికి సహాయం చేయాలని కన్నీరు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment