చెన్నై గుండె ఆపరేషన్ వైద్య బృందంలో
బళ్లారి టౌన్ : భారత వైద్య చరిత్రలోనే చెన్నై బీజీఎస్ గ్లోబల్ ఆస్పత్రిలో బుధవారం జరిగిన అరుదైన గుండె ఆపరేషన్ వైద్య బృందంలో బళ్లారి మెడికల్ కళాశాలలో చదివిన డాక్టర్ సురేష్ రావు పాల్గొనడం బళ్లారి జిల్లా వాసులు గర్వించదగ్గ విషయం. 1993లో బళ్లారి మెడికల్ కళాశాలలో విద్యాభ్యాసం చేసిన సురేష్‌రావు గుండె ఆపరేషన్‌లో పాలు పంచుకోవడం తమకు ఎంతో గర్వకారణమని విమ్స్ డెరైక్టర్ డాక్టర్ లక్ష్మినారాయణరెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ విద్యాధర్ కిన్నాళ, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ సీ.యోగానందరెడ్డి పేర్కొన్నారు.
ఈ మేరకు వారు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రమాదానికి గురైన ఓ మహిళ గుండెను తీసి బెంగళూరు నుంచి విమానంలో చెన్నైకి తీసుకెళ్లి అతి తక్కువ వ్యవధిలోనే మరొకరికి ఆపరేషన్ చేసి పెట్టడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. ఓ పేద కుటుంబం నుంచి వచ్చిన సురేష్‌రావు బళ్లారి మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివి ఉన్నత స్థానానికి ఎదిగినందుకు తాము ఎంతో గర్విస్తున్నామని పేర్కొన్నారు.