వైద్య చరిత్రలో ఓ అద్భుతం : చెన్నైలో గుండె మార్పిడి | Heart operation in Chennai | Sakshi
Sakshi News home page

వైద్య చరిత్రలో ఓ అద్భుతం: చెన్నైలో గుండె మార్పిడి

Published Wed, Sep 3 2014 7:30 PM | Last Updated on Sat, Sep 2 2017 12:49 PM

గుండెను ప్రత్యేక ద్రవంలో ఉంచి తరలిస్తున్న దృశ్యం

గుండెను ప్రత్యేక ద్రవంలో ఉంచి తరలిస్తున్న దృశ్యం

చెన్నై:  భారతీయ వైద్య చరిత్రలో ఈరోజు ఓ అద్భుతం జరిగింది.  బెంగళూరు నుంచి గుండెను చెన్నైకు ఆగమేఘాల మీద తరలించి, గుండె మార్పిడి ఆపరేషన్ చేశారు. ఆరు గంటల వరకే గుండెలో జీవం ఉంటుంది.  కర్నాటక, తమిళనాడు  రాష్ట్రాల వైద్యులు, పోలీసు, ట్రాఫిక్ పోలీసు అధికారుల మధ్య సమన్వయం, ప్రజల సహకారంతో సకాలంలో గుండెను బెంగళూరు నుంచి చెన్నై చేర్చారు. చెన్నై వైద్యులు  ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించారు.  42 కిలో మీటర్ల దూరం 40 నిమిషాలలో అంబులెన్స్లో ,  12 కిలో మీటర్లు పది నిమిషాలలో గుండెను తరలించారు. చెన్నైలో రెండు గంటల ముందు నుంచి జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రజలు రెండు గంటలపాటు తమ వాహనాలను పక్కన పెట్టి సహకరించారు.

గుండె మార్పిడిలో చెన్నై వైద్యులు అరుదైన రికార్డు సాధించారు. ముంబైకి చెందిన 42 ఏళ్ల ఓ రోగికి బెంగళూరులో బ్రెయిన్‌డెడ్‌ మహిళ నుంచి గుండెను తీసి అమర్చారు. అది కూడా అతి తక్కువ వ్యవధిలో పూర్తి చేశారు. ఇందుకోసం కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల పోలీసులు సహకరించారు. వారం రోజులుగా దాతలకోసం ఎదురుచూసిన చెన్నైలోని మలర్ ఆస్పత్రి వైద్యులకు బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బ్రెయిన్‌డెత్‌ అయిన మహిళ గుండెను బాధితునికి ఇచ్చేందుకు ఆమె బంధువులు అంగీకరించారని సమాచారం అందింది.

 వెంటనే యుద్ధ ప్రాతిపదికన రెండు రాష్ట్రాల పోలీసులతో మాట్లాడి తగిన ఏర్పాట్లు చేశారు. అత్యంత రద్దీగా ఉండే చెన్నై విమానాశ్రయం నుంచి ఆసుపత్రి వరకూ త్వరగా చేరుకునేందుకు తమిళనాడు పోలీసులు అన్ని ఏర్పాట్లూ చేశారు. అంతకుముందు బెంగళూరులో మహిళ నుంచి గుండెను స్వీకరించిన వైద్యులు 42 కిలోమీటర్ల దూరాన్ని అంబులెన్స్‌లో 40 నిమిషాల్లో దాటారు. కర్నాటక పోలీసులు గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ క్లియర్‌ చేయడంతో ఇది సాధ్యమైంది. రసాయనాలతో ప్రత్యేక ఏర్పాట్లు చేసి గుండెను అంబులెన్స్‌లో తరలించారు. ఆ తర్వాత అక్కడే సిద్దంగా ఉన్న ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం గుండెతో బయలుదేరి సరిగ్గా  4 గంటల 25 నిమిషాలకు చెన్నై చేరుకుంది. చెన్నైలో అప్పటికే సిద్ధంగా ఉన్న ప్రత్యేక అంబులెన్స్ లో బయలు దేరి 12 కిలోమీటర్ల దూరాన్ని 10 నిమిషాల్లో దాటి ఆసుపత్రికి చేరుకున్నారు.

దారిలో 13 సిగ్నళ్లు దాటిమరీ సరిగ్గా 4 గంటల 35 నిమిషాలకు మలర్ ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడ సిద్ధంగా ఉన్న వైద్యులు గుండెను బాధితుడికి అమర్చటంలో విజయం సాధించారు. చెన్నై వైద్యులు రికార్డు సృష్టించారు.  సినీ ఫక్కీలో సాగిన ఈ గుండె ప్రయాణం.. ఓ ప్రాణాన్ని కాపాడింది. రెండు రాష్ట్రాల పోలీసులు, వైద్యుల సమన్వయంపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement