నడుపుకోవడానికి అనుమతినివ్వండి
Published Mon, Sep 30 2013 2:47 AM | Last Updated on Fri, Sep 1 2017 11:10 PM
న్యూఢిల్లీ: ‘మా జీవితం ఆ బస్సుపైనే ఆధారపడి ఉంది. మా జీవనాధారం ఆ బస్సే. దయచేసి దానిని నడుపుకునేందుకు అనుమతిని ఇవ్వండి. జరగరాని దారుణం ఆ బస్సులో జరిగింది. అయితే దానిపై ఆధారపడి నేను, నా ఇద్దరు పిల్లలు బతుకుతున్నాం. దానిని తిరిగి మాకు ఇచ్చేయండి’ అని కోరుతున్నారు దినేశ్ యాదవ్ సతీమణి. నిర్భయ అత్యాచారానికి గురైన తర్వాత ఆ తెల్లని బస్సు సాకేత్ కోర్టు ఆవరణలోనే ఉంది. అద్దాలు పగిలిపోయి, టైర్లు పూర్తిగా నేలకొరిగి, సీట్లు మసకబారిన స్థితిలో ఉన్న ఆ బస్సును తిరిగి తమకు అప్పగిస్తే నడుపుకుంటామని బస్సు యజమాని దినేశ్ యాదవ్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
నకిలీ పత్రాలు సమర్పించి, రిజిస్ట్రేషన్ చేసుకున్న నేరానికి బస్సు యజమాని దినేశ్ యాదవ్ కూడా ప్రస్తుతం కటకటాల వెనక ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆయన సతీమణి, ఆమె తండ్రి కోర్టును ఆశ్రయించారు. బస్సు నడిస్తేనే కుటుంబం పూట గడుస్తుందని, అలాంటిది దాదాపు 10 నెలలుగా కోర్టు ఆవరణలోనే ఉన్నందున కుటుంబ పోషణ కష్టంగా మారిందని, కేసు విచారణ ముగిసినందున దానిని తమకు అప్పగిస్తే మరమ్మతులు చేసుకొని నడుపుకుంటామని కోరుతున్నారు. ఈ విషయమై త్వరలో సాకేత్ కోర్టును ఆశ్రయించనున్నట్లు చెప్పారు.
డీఎల్ 1పీసీ 0149 నంబర్‌తో రిజిస్ట్రేషన్ అయిన ఈ బస్సును దుర్ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే పోలీసులు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి పోలీసుల అదుపులోనే ఈ బస్సు ఉంది. కేసు విచారణ ప్రారంభమైన తర్వాత కోర్టుకు అప్పగించారు.
Advertisement