
సూపర్‌స్టార్‌కు పద్మవిభూషణ్?
సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు పద్మవిభూషణ్ పురస్కారం దక్కనుందా? ఈ ప్రశ్నకు అవుననే ప్రచారం జోరందుకుంది.
సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు పద్మవిభూషణ్ పురస్కారం దక్కనుందా? ఈ ప్రశ్నకు అవుననే ప్రచారం జోరందుకుంది. నిజానికి రజనీకాంత్ ఎలాంటి అవార్డులను ఆశించి చిత్రాలు చేయలేదన్నది నిజం. తన నిర్మాత శ్రేయస్సు, బయ్యర్ల ప్రయోజనాలు, అభిమానుల ఆనందాలకు ప్రాముఖ్యతనిచ్చిన నటుడు రజనీకాంత్. అందుకే అవార్డుకు చిహ్నంగా చెప్పబడే కథా చిత్రాల జోలికి పోకుండా, వాణిజ్య విలువలతో కూడిన జనరంజక కథాచిత్రాలనే చేసుకుంటూ వస్తున్నారు.
అయితే వాటిలో దక్షిణాది చిత్రాలే కాకుండా హిందీ, ఇంగ్లీష్ తదితర భాషా చిత్రాలు చోటు చేసుకున్నాయి. ఇంకా చెప్పాలంటే రజనీకాంత్ తమిళ చిత్రాలతోనే జపాన్, కెనడా, మలేషియా, సింగపూర్ మొదలగు దేశాల్లో కూడా అశేష అభిమానులను పొందారు. అలాంటి నటుడిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన నటనా సేవకు తగిన గుర్తింపునివ్వలేదనే అపవాదు ఒక వర్గం వ్యక్తం చేస్తోందన్నది వాస్తవం.
ఒక సామాన్య బస్సు కండక్టర్ స్థాయి నుంచి భారతీయ చిత్రసీమలో ఒక బలమైన నటుడిగా ఎదిగారాయన. తమిళ సినీ అభిమానుల మధ్య సూపర్‌స్టార్‌గా నేటికీ వెలుగొందుతున్న రజనీకాంత్‌ది నాలుగు పదుల నటజీవితం. ఈ కాలంలో శతాధిక చిత్రాలు చేసిన రజనీకాంత్‌కు భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మభూషణ్ పురష్కారంతో గౌరవించింది. ఇతర ప్రైవేట్ అవార్డులు పలు వరించినా, ప్రభుత్వపరంగా ఇప్పటికి పద్మభూషణ్ ఒక్కటే అందుకున్నారు.
అభిమానుల ఆనందహేలల్నే అన్నిటికీ మించిన అవార్డులు, రివార్డులుగా భావించే మన సూపర్‌స్టార్‌కు తాజాగా భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక అవార్డులలో ద్వితీయ స్థాయి పద్మవిభూషణ్ అవార్డు వరించబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం. గణతంత్ర దినోత్సం సందర్భంగా రాష్ట్రపతి వెల్లడించనున్న అవార్డు గ్రహీతల పేర్లలో రజనీకాంత్ పేరు చోటు చేసుకుంటున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ప్రస్తుతం రజనీ ఏకధాటిగా కబాలీ, 2.ఓ చిత్రాలలో నటిస్తున్నారు.