న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ వ్యవహారంపై సభలో రగడ
Published Fri, Feb 14 2014 12:47 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
సాక్షి, న్యూఢిల్లీ: సోమ్‌నాథ్ భారతి వ్యవహారంపై లోపలా, బయటా వెల్లువెత్తిన నిరసనలతో శాసనసభ ప్రాంగణం అట్టుడికిపోయింది. న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతిని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ , బీజేపీ పి సభ్యులు వెల్‌లోకి దూసుకుపోయి నివాదాలు చేయడంతో తొలిరోజు గందరగోళం చెలరేగింది. ఈ కారణంగా కార్యకలాపాలు కొనసాగలేదు. మూడుసార్లు వాయిదావేసిన స్పీకర్... సభా కార్యక్రమాలు సజావుగా నిర్వహించడం కోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసినా ఫలితం లేకపోయింది. చివరికి సభను శుక్రవారానికి వాయిదా వేవారు.
అర్థరాత్రి సమయంలో విదేశీ మహిళల ఆవాసాల్లో సోదాలు జరిపించి నగరవాసులకు తలవంపులు తెచ్చిన న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ వ్యవహారాన్ని సభలో లేవనెత్తేందుకు బీజేపీ సావధాన తీర్మాన నోటీసు ఇచ్చింది. కాంగ్రెస్ కూడా ఇందుకు మద్దతు పలికింది. స్పీకర్ ఎం.ఎస్. ధీర్ ఈ నోటీసును సభలో చదవి వినిపించి దానిపై సోమ్‌నాథ్ ప్రతిస్పందన కోరారు. సోమ్‌నాథ్ ప్రతిస్పందించిన అనంతరం బీజేపీ నోటీసుపై రూలింగ్ ఇస్తానని స్పీకర్ ప్రకటించారు. అయితే ఈ నోటీసును స్వీకరించి చర్చ చేపట్టాలంటూ సభ్యులు పట్టుపట్టారు.
కాంగ్రెస్, బీజేపీ సభ్యులు స్పీకర్ ముందుకొచ్చి సోమ్‌నాథ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా సోమ్‌నాథ్‌కు వ్యతిరేకంగా నినాదాలు రాసిన ప్లకార్డులను సభలో ప్రదర్శించారు. గందరగోళ పరిస్థితుల మధ్య స్పీకర్ సభను మూడుసార్లు వాయిదావేసినా ఫలితం లేకపోయింది. దీంతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి సభ సజావుగా సాగడానికి సహకరించాలంటూ కాంగ్రెస్, బీజేపీలను కోరారు. సభ తిరిగి సమావేశమైన తరువాత కూడా అదే పరిస్థితి పునరావృతమైంది. ఓఖ్లా శాసన సభ్యుడు ఆసిఫ్ మహ్మద్‌ఖాన్ స్పీకర్ ముందున్న మైకు లాక్కొని దానిలోనుంచే సోమ్‌నాథ్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ముందున్న కాగితాలను చింపివేశారు. కేజ్రీవాల్ ముందున్న మైకును కూడా ఆయన విరగ్గొట్టారని అంటున్నారు. ఈ గందరగోళం ఇలా కొనసాగుతుండగానే బీజేపీ ఇచ్చిన నోటీసును స్వీకరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
స్పీకర్ ఆరంభ ప్రసంగంతోనే లొల్లి మొదలు
కాగా గురువారం మధ్యాహ్నం విధానసభ సమావేశాలను ప్రారంభిస్తూ స్పీకర్ చేసిన ఆరంభ ప్రసంగంతోనే లొల్లి మొదలైంది. అసెంబ్లీ సమావేశాలను ప్రత్యేక సమావేశాలుగా పేర్కొనడాన్ని బీజేపీ సభ్యులు తప్పుపట్టారు. ఈ సమావేశాలను బడ్జెట్ సమావేశాలుగా పేర్కొనాలని వారు డిమాండ్ చేశారు. ఆ త ర్వాత విధానసభలో బీజేపీ నేత హర్షవర్ధన్ న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతి వ్యవహారాన్ని సభలో లేవనెత్తేందుకు సావధాన తీర్మాన నోటీసు ఇచ్చారు.
డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ కూడా ఇందుకు మద్దతు పలికారు. ఇంతలోనే బీజేపీ సభ్యులు సోమ్‌నాథ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లారు. రాజేందర్‌నగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే ఆర్ .పి. కాగితాలు చింపి సోమ్‌నాథ్ వైపు విసిరారు. కాంగ్రెస్ సభ్యులు కూడా సోమ్‌నాథ్ వ్యతిరేక నినాదాలకు గొంతు కలిపారు. కాంగ్రెస్ సభ్యుడు జైకిషన్ అల్లం, నిమ్మకాయలు తదితర వస్తువులను స్పీకర్ ఎదుట పెట్టగానే ‘బందర్ క్యా జానే అద్రక్ స్వాద్ (కోతికి ఏమి తెలుసు అల్లం రుచి) అంటూ ప్రతిపక్ష సభ్యులు కేజ్రీవాల్ సర్కారును ఎగతాళి చేయడం, సోమ్‌నాథ్ భారతి హాయ హాయ్ అనే సభ్యుల నినాదాల మధ్య స్పీకర్ సభను వాయిదావేశారు. 20 నిమిషాల తరువాత తిరిగి సమావేశ ం ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు సభ మధ్యలోకి దూసుకువచ్చారు.
సోమ్‌నాథ్ భారతి నగరంలో జాతి వివక్షను ప్రోత్సహిస్తున్నారనే ప్లకార్డులను ధరించిన సభ్యులు సోమ్‌నాథ్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్పీకర్ మరోసారి సభను 20 నిమిషాలపాటు వాయిదా వేశారు. ఆ తరువాత తిరిగి సభ సమావేశమైనప్పుడు కూడా వాతావరణంలో ఎటువంటి మార్పూ కనిపించలేదు. దీంతో స్పీకర్ మూడోసారిసభను వాయిదావేసి అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేశారు. ఆప్ నుంచి బహిష్కృతుడైన వినోద్‌కుమార్ బిన్నీ అధికార పార్టీ సభ్యులతోపాటు కూర్చోవడం కూడా కొంతసేపు వివాదానికి దారితీసింది. బీజేపీ సభ్యులు ఈ విషయమై బిన్నీని ప్రశ్నించగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తానుకూడా ప్రభుత్వ విప్ ప్రకారం ఓటు వేయవలసిందేనంటూ స్పీకర్ ఆదేశించారని, అందువల్ల తాను అధికార పార్టీ సభ్యుల పక్కనే కూర్చున్నానని చెప్పారు.
సభ బయటా నిరసన జ్వాలలు
శాసనసభలోనే కాకుండా బయటకూడా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు మార్మోగాయి. కాం ట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీరించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ మాజీ శాసనసభ్యులు ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శన నిర్వహించారు. విద్యుత్ చార్జీల మాఫీని అందరికీ వర్తింపజేయాలని, సోమ్‌నాథ్ భారతిని మంత్రిపదవి నుంచి తప్పించాలని డిమాండ్ చే యడమే కాకుండా కేజ్రీవాల్‌కే వ్యతిరేకంగా నినదించారు. అంతటితో ఆగకుండా ధర్నా చేశారు. భద్రతా సిబ్బంది వారిలో కొందరిని బస్సులో ఎక్కించి దూరంగా తీసుకెళ్లారు.
Advertisement
Advertisement