
అన్నీతానై..
► సీఎం భుజస్కంధాలపై పార్టీ
► చిన్నచూపు చూస్తున్నారని చిన్నమ్మ కినుక
అమ్మ మరణం, చిన్నమ్మ జైలు జీవనం, దినకరన్ కటకటాల పాలుతో ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి అన్నీతానై వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొంది. కుడి ఎడమలగా పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిస్తూ నెట్టుకొస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: అక్రమ ఆస్తుల కేసులో పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ జైలుపాలయ్యారు. చిన్నమ్మ లేని లోటును తీర్చేం దుకు ఉప ప్రధాన కార్యదర్శిగా నియమితులైన టీటీవీ దినకరన్ పార్టీ సారధిగా కొన్ని నెలలపాటు హడావుడి చేశారు.
ఆర్కేనగర్ ఎన్నికల్లో ఓటర్లకు నోట్లు పంచి, రెండాకుల చిహ్నం కోసం ఎన్నికల సంఘానికి లంచం ఎరవేసి అప్రతిష్టపాలైన దినకరన్ సైతం ఢిల్లీ పోలీసుల చేతికి చిక్కి జైలుపక్షిగా మారి పోయారు. అన్నాడీఎంకే నుంచి చీలిపోయిన మాజీ ముఖ్య మంత్రి పన్నీర్‌సెల్వంతో సంధి కుదుర్చుకోవడం ద్వారా పార్టీ పగ్గాలు అప్పగించాలని ఎడపాడి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో పార్టీ బాధ్యతలు ఎడపాడి భరించక తప్పలేదు. అన్నాడీఎంకే అమ్మ వర్గం ప్రధాన కార్యాలయ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. పార్టీ తరఫున సంతాపం, ఇతర ప్రకటనలను ఎడపాడే విడుదల చేస్తున్నారు.
చిన్నమ్మ ఆవేదన: జెలుకెళ్లిన కొత్తల్లో వరుసపెట్టి వచ్చేవారంతా చాలించేశారు. అధికారం అనుభవిస్తున్న వారంతా తనను చిన్నచూపు చూస్తున్నారని బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ఆవేదన చెందుతున్నట్లు సమాచారం. ఆస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష పడగానే తల్లడిల్లిపోయిన మంత్రులు, పార్టీ నేతలు జైలు వద్ద క్యూకట్టారు. మాజీ మంత్రులు వలర్మతి, గోకుల ఇందిర, పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి బెంగళూరు జైలు సిబ్బంది చేత తరిమివేయబడ్డారు.
ములాఖత్ నిబంధనలను ధిక్కరించి జైలు వద్దకు వస్తే ఊరుకోమని బెంగళూరు జైలు అధికారులు నేతలను హెచ్చరించా ల్సివచ్చింది. శశికళ, ఇళవరసి, సుధాకరన్ రక్త సంబంధీకులను మాత్రమే అనుమతిస్తామని జైలు అధికారులు తేల్చిచెప్పారు. చిన్నమ్మ దర్శనం కోసం జైలు అధికారులను అంతగా విసిగించిన పార్టీ నేతల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. నేతలెవరూ తనవైపు రాకపోవడంతో చిన్నమ్మ చిన్నబుచ్చుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ, ప్రభుత్వం తన చేతుల నుంచి జారి పోయినట్లుగా భావిస్తూ విరక్తి చెందుతోంది. ఇళవరసి కుమారుడు వివేక్ ఇటీవల శశికళను కలుసుకోగా ఒంటరి దాన్నై పోయాను అని వాపోయినట్లు సమాచారం. జయలలిత ధరించే ఆకుపచ్చ చీరను తెచ్చిస్తే కొంత ఊరటగా ఉంటుందని వివేక్‌ను కోరడంతో చెన్నై నుంచి తీసుకెళ్లి అప్పగించాడు.
ప్రభుత్వాన్ని రద్దు చేయాలి: దీప
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించినందున ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేయాలని ఎంజీఆర్ అమ్మ దీప పేరవై ప్రధాన కార్యదర్శి దీప శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తన హయాంలో తమిళనాడును దేశంలోనే శాంతిధామంగా పరిపాలించగా, ఆమె మరణం తరువాత బాధ్యతలు చేపట్టిన పన్నీర్‌సెల్వం, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన ఎడపాడి పళనిస్వామి అరాచకపాలనకు తావిచ్చారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల ప్రశాంత జీవనం కోసం ఆర్టికల్ 356 ప్రయోగించి శశికళ బినామీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరారు.