
పన్ను మోత
బృహత్ బెంగళూరు మహానగర పాలికే పరిధిలోని వివిధ రకాల ఆస్తులపై పన్ను పెంచే ఆలోచన ఉందని ముఖ్యమంత్రి ...
బీబీఎంపీ పరిధిలో త్వరలో అమలుకు రంగం
పరిషత్‌లో ప్రకటించిన సీఎం సిద్ధరామయ్య
బెంగళూరు : బృహత్ బెంగళూరు మహానగర పాలికే పరిధిలోని వివిధ రకాల ఆస్తులపై పన్ను పెంచే ఆలోచన ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పరిషత్‌కు తెలిపారు. తద్వారా వచ్చిన నిధులతో ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తామన్నారు. శీతాకాల సమావేశాల్లో భాగంగా గురువారం జరిగిన సభా కార్యక్రమాల్లో భాగంగా బీజేపీ ఎమ్మెల్సీ వైఏ నారాయణస్వామి అడిగిన ప్రశ్నకు సీఎం సిద్ధు సమాధానమిస్తూ.. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడానికి అనుగుణంగా నిధుల సమీకరణ కోసం పన్నుల పెంపు అనివార్యమన్నారు. చాలా ఏళ్ల నుంచి బీబీఎంపీ పరిధిలోని ఆస్తులపై పన్ను పెంచలేదని ఈ సందర్భంగా సిద్ధరామయ్య పరిషత్‌కు గుర్తు చేశారు. మరోవైపు కొన్ని ఆస్తులపై ఎక్కువపన్నులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై కూడా దృష్టి సారిస్తామని తెలిపారు.
మరోవైపు బీబీఎంపీ పరిధిలో 16 లక్షల ఆస్తులు ఉండగా 14 లక్షల ఆస్తుల నుంచే పన్నులు వసూలు చేస్తున్నామన్నారు. మిగిలిన రెండు లక్షల ఆస్తుల నుంచి కూడా నిర్ధిష్ట పరిమాణంలో పన్నులు వసూలు చేయడానికి అవసరమైన ప్రక్రియ మొత్తం ఇప్పటికే పూర్తి చేశామన్నారు. ప్రతి ఏడాది బీబీఎంపీ పరిధిలోని ఆస్తుల నుంచి రూ.6 వేల కోట్లను పన్నుల రూపంలో వసూలు చేయడానికి వీలవుతుందన్నారు. అయితే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ లక్ష్యానికి చేరుకోలేకపోతున్నామని సిద్ధరామయ్య వాపోయారు. ఇకపై పన్నుల వసూలులో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.