బీజేపీ నాయకుడి ఇంటిపై పెట్రో బాంబు దాడి
Published Fri, Sep 27 2013 3:56 AM | Last Updated on Fri, Sep 1 2017 11:04 PM
ప్యారిస్, న్యూస్లైన్: కోవై వడవెల్లి సమీపంలో కస్తూరినాయకన్ పాళయంలో బీజేపీ నాయకుడి ఇంటిపై బుధవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు పెట్రో బాంబులతో దాడి చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. కస్తూరి పాళయంలో నివాసముంటున్న పురోహితుడు రామనాథన్ (40) వేలాండి పాళయం మండల బీజేపీ అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
ఆ ప్రాంతంలో ఇటీవల హిందూ సంస్థకు చెందిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కారణంగా పోలీసులు ఆయనకు భద్రత కల్పించారు. బుధవారం రాత్రి ఆయన భద్రతకోసం నియమితులైన పోలీసు కానిస్టేబుళ్లతో కలిసి నిద్రించేందుకు వెళ్లాడు. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఇంటి ముందు పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. హుటాహుటిన బయటికి వచ్చి చూడగా పెట్రో బాంబు దాడి జరిగి ఉండడం గుర్తించారు.
రామనాథన్, పోలీసులతో కలిసి రావడాన్ని చూసిన దుండగులు నలుగురు కారులో పారిపోయారు. రామనాథన్ ఫిర్యాదు మేరకు వడవెల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. జిల్లా ఎస్పీ సుధాకరన్, డీఎస్పీ తంగదురై అక్కడికి చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పాతకక్షలు ఏమైనా ఉన్నాయా, ఉంటే వారు ఎవరూ అనే కోణంలో పోలీసులు తీవ్ర విచారణ జరుపుతున్నారు.
Advertisement
Advertisement