
సుబ్రమణియన్ (ఫైల్)
సాక్షి, చెన్నై: తూత్తుకుడిలో రౌడీని పట్టుకునే క్రమంలో హెడ్‌కానిస్టేబుల్ హత్యకు గురయ్యాడు. ఆ రౌడీ నాటుబాంబుల్ని విసరడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
సాత్తాన్‌కులం లాకప్‌లో తండ్రి జయరాజ్, తనయుడు ఫిలిప్స్‌లో మరణంతో తూత్తుకుడి జిల్లా పోలీసులు తలెత్తలేని పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ కేసు సీఐ విచారణలో ఉంది. ఈసమయంలో తూత్తుకుడి పోలీసులు తలెత్తుకునే రీతిలో, పోలీసులపై సానుభూతి పెరిగే ఘటన మంగళవారం చోటుచేసుకుంది. రౌడీని పట్టుకునేందుకు ప్రయత్నించిన హెడ్‌కానిస్టేబుల్ హత్యకు గురి కావడాన్ని తూత్తుకుడి వాసులు తీవ్రంగా పరిగణించారు.
నాటుబాంబు దాడి..
తూత్తుకుడి జిల్లా వెలనాడుకు చెందిన దురైముత్తుపై శ్రీవైకుంఠం, మెరప్పనాడు పోలీసు స్టేషన్లలో ఐదు కేసులు ఉన్నాయి. ఇటీవల జరిగిన జంటహత్య కేసులోనూ దురైముత్తు నిందితుడు కావడంతో అతడ్ని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగానే వేటసాగిస్తూ వచ్చారు. ఎస్‌ఐ మురుగపెరుమాల్‌కు అందిన సమాచారంతో వెలనాడు అటవీ గ్రామంలో దురైముత్తు కోసం వేట మొదలెట్టారు. పోలీసుల్ని చూసిన దురైముత్తు, అతడి అనుచరులు ఉడాయించారు. ఈ సమయంలో హెడ్‌కానిస్టేబుల్ సుబ్రమణ్యన్ సాహసం ప్రదర్శించాడు. అతడ్ని పట్టుకునేందుకు సినీ తరహాలో దూసుకెళ్లాడు. వెంటాడి మరీ పట్టుకునే సమయానికి దురైముత్తు ఎదురుదాడి చేశాడు. తన వద్ద ఉన్న నాటుబాంబును సుబ్రమణ్యన్‌పై వేయడంతో అది పేలింది. తీవ్రంగా హెడ్ కానిస్టేబుల్ గాయపడడంతో మిగిలిన సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.
తీవ్రంగా పరిగణన..
తీవ్రంగా గాయపడ్డ సుబ్రమణ్యన్‌ను ఆస్పత్రికి తరలించగా మరణించాడు. దీంతో ఈ ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఎస్పీ జయకుమార్ రంగంలోకి దిగారు. దురైముత్తును పట్టుకునేందుకు ఐదు బృందాలు రంగంలోకి దిగాయి. ఈ ఘటన గురించి ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ఎస్‌ఐకు అందిన సమాచారంతో హెడ్‌కానిస్టేబుల్ సుబ్రమణ్యన్ నేతృత్వంలో నలుగురు పోలీసులు రౌడీ ముఠాను పట్టుకునేందుకు వెళ్లారని, ఈ క్రమంలో నాటుబాంబుతో ఆ రౌడీ దాడిచేసి తప్పించుకున్నాడని, కేసును తీవ్రంగా పరిగణించామన్నారు. ఆ రౌడీని పట్టుకుని తీరుతామని, కేసు విచారణలో ఉన్నట్టు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ సందీప్ నండూరి స్పందిస్తూ, ఓ రౌడీని పట్టుకునే క్రమంలో హెడ్‌కానిస్టేబుల్ బలయ్యారని, ఘటన గురించి మరిన్ని వివరాలను సేకరిస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఎస్పీ జయకుమార్, కలెక్టర్ సందీప్ నండూరి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. హెడ్‌కానిస్టేబుల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన శ్రీవైకుంఠం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబానికి సీఎం ఎడపాడి రూ.50 లక్షలు ప్రకటిస్తూ, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపారు.