
బంగ్లాలోకి పోలీసులు
► చిన్నమ్మ వద్ద విచారణకు కసరత్తు
కొడనాడు బంగ్లాలో నీలగిరి జిల్లా పోలీసులు తనిఖీల్లో నిమగ్నమయ్యారు. దర్యాప్తును మరింత ముమ్మరం చేయడం లక్ష్యంగా చిన్నమ్మ శశికళ, టీటీవీ దినకరన్‌లను విచారించేందుకు తగ్గ కసరత్తుల్లో ఉన్నట్టు సమాచారం.
సాక్షి, చెన్నై : దివంగత సీఎం జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో చుట్టూ సాగుతున్న పరిణామాలు, అనుమానాలు క్రైం సినిమాను తలపిస్తున్న విషయం తెలిసిందే. రోజుకో ఘటన చోటు చేసుకుంటుండడంతో మిస్టరీని నిగ్గుతేల్చడం నీలగిరి జిల్లా పోలీసులకు శిరోభారంగా మారింది. కోయంబత్తూరు, నీలగిరి, సేలం, కేరళ తిరుచ్చూరు జిల్లాల పోలీసులు జరుగుతున్న ఘటనలపై దృష్టి పెట్టారు. సమష్టిగా చిక్కుముడిని విప్పేందుకు తగ్గ కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.
విచారణలో పట్టుబడ్డ వారు ఇస్తున్న వాంగ్మూలం పొంతన లేని రీతిలో ఉండడంతో, దర్యాప్తు వేగం పెంపునకు సిద్ధమయ్యా రు. శనివారం నీలగిరి జిల్లా పోలీసులు కొడనాడు ఎస్టేట్‌లో తనిఖీల్లో నిమగ్నమయ్యారు. బంగ్లా పరిసరాల్లో తొలిరోజు తనిఖీ సాగినా, పూర్తిగా ఎస్టేట్ పరిశీలన అనంతరం చివరగా బంగ్లాలోకి అడుగు పెట్టి సోదాలకు నిర్ణయించారు. అయితే, కొడనాడు బంగ్లాలో ఏమి ఉందో అన్న వివరాలు అమ్మ జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళకు తెలిసి ఉండే అవకాశాలు ఎక్కువ.
ఆమె తదుపరి అన్నాడీఎంకే బహిష్కృత ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌కు తెలిసి ఉండొచ్చు. ఈ ఇద్దర్ని విచారించడం ద్వారానే ఆ బంగ్లాలో ఏమి ఉన్నదని, దోపిడీ, జరుగుతున్న పరిణామాలు, ఘటనలు కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నట్టు పోలీసు యంత్రాంగం భావిస్తున్నది. అయితే, ఆ ఇద్దరు కేంద్ర కారా గారాల్లో ఉండడంతో విచారణ అంత సులభం కాదని చెప్పవచ్చు. ఆ ఇద్దర్ని విచారించేందుకు ఇటు కర్ణాటక, అటు ఢిల్లీ కోర్టుల్ని ఆశ్రయించేందుకు తగ్గ కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. కొడనాడులో జరిగిన ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సెక్యూరిటీ కృష్ణ బహూదూర్ కోలుకున్నాడు. శనివారం విధులకు హాజరైనట్టు సమాచారం.