మదన్ కోసం ప్రత్యేక బృందాలు
తమిళసినిమా: వేందర్ మూవీస్ నిర్మాత మదన్ కోసం పోలీసు ప్రత్యేక బృందం గాలింపు చర్యలు చేపట్టింది. ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో మెడికల్ సీట్ ఇప్పిస్తానని వారి తల్లిదండ్రుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన కేసులో ఇతను నిందితుడు. గత నెల 27న ఆత్మహత్య చేసుకుంటానని లేఖ రాసి అదృశ్యం అయ్యాడు. అప్పటి నుంచి అతని జాడ తెలియరాలేదు. అయితే ఆయనపై కేసుల పరంపర కొనసాగుతోంది.
మద్రాసు హైకోర్టు ఆదేశాలతో కేంద్ర నేరపరిశోధన శాఖ అడిషనల్ డిప్యూటీ డెరైక్టర్ నేతృత్వంలో నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఒక బృందం వారణాసి, మరో మూడు బృందాలు నెల్లై, ఇతర రాష్ట్రాల్లో మదన్ కోసం గాలిస్తున్నాయి. వైద్య సీట్ల ఇప్పిస్తానని మోసం చేశాడని ఇప్పటి వరకు 63 మంది ఫిర్యాదులు చేశారు. రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. మదన్ పట్టుబడిన తరువాత ఈ కేసులన్నిటిపై విచారిస్తామని అన్నారు.