
పెద్దల సభలోనూ ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీ!
⇒ శాసనమండలిలో మారనున్న రాజకీయ సమీకరణాలు
⇒ ఈ ఏడాది 22 మంది ఎమ్మెల్సీల పదవీ విరమణ
⇒ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా గల్లంతు
⇒ బడ్జెట్ సమావేశాల తర్వాతే మార్పులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో రాజకీయ సమీకరణాలు మారిపోనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీల్లో 22 మంది ఈ ఏడాది పదవీ విరమణ చేయనున్నారు. దీంతో మండలిలో రాజకీయ పార్టీల బలాబలాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. వైఎస్సార్‌సీపీకి పెద్దల సభలోనూ ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కబోతోంది. మండలిలో మొత్తం 58 మంది సభ్యులుండగా.. ఐదుగురు పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి.. మరో ఐదుగురు ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి, 20 మంది స్థానిక సంస్థల కోటాలో, ఇంకో 20 మంది ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికవుతారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించే 8 మందిని గవర్నర్ ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తారు.
మొత్తం 58 మంది ఎమ్మెల్సీల్లో ప్రతి రెండేళ్లకోసారి మూడో వంతు సభ్యులు పదవీ విరమణ చేయడంతో ఏర్పడే ఖాళీలకు ఎప్పటికప్పుడు కొత్తగా ఎన్నికలు జరుగుతాయి. ఈ ఏడాది ఖాళీ అయ్యే స్థానాల్లో మూడు పట్టభద్రుల నియోజకవర్గాలు, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలతోపాటు తొమ్మిది స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోగానీ, లేదంటే ఆ తర్వాత కొద్ది రోజులకు ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. తర్వాత గవర్నర్ కోటాలో ఖాళీ అయ్యే రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో గవర్నర్ కొత్త వారిని నియమిస్తారు.
ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీల పదవీ విరమణ
శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ గత మూడేళ్లుగా ప్రధాన ప్రతిపక్ష హోదా కలిగి ఉంది. ఆ పార్టీ ఈ ఏడాది మండలిలో ఆ హోదాను కోల్పోనుంది. అధికారిక లెక్కల ప్రకారం... మొత్తం 58 మంది సభ్యులుండే మండలిలో అధికార టీడీపీకి ఇప్పుడు (పదవీ విరమణ చేసిన వారితో కలిపి) 23 మంది సభ్యుల బలం ఉంది. రెండో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్‌కు 8 మంది సభ్యులున్నారు. వైఎస్సార్‌సీపీకి ఐదుగురు ఉన్నారు. కాంగ్రెస్‌కు సభ్యుల్లో ఏడుగురు ఈ ఏడాది పదవీ విరమణ చేయనున్నారు. మండలి ప్రతిపక్ష నేతగా ఉన్న సి.రామచంద్రయ్య పదవీకాలం ముగుస్తోంది. కాంగ్రెస్‌కు అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడం, స్థానిక సంస్థల నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు కౌన్సిలర్లుగా ఎన్నికైన వారు కూడా తక్కువగా ఉండడంతో ఎన్నికలు జరిగే స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం దాదాపు లేదనే చెప్పవచ్చు.
అదే సమయంలో మండలిలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్సీల్లో ఈ ఏడాది ఎవరూ పదవీ విరమణ చేసే వారిలో లేరు. కొత్తగా ఎన్నికలు జరిగే చోట వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఉన్నాయి. పార్టీకి పెద్దసంఖ్యలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు ఉండడమే ఇందుకు కారణం. దీంతో ఈ ఎన్నికల తర్వాత మండలిలో వైఎస్సార్‌సీపీ రెండో పెద్ద పార్టీగా అవతరించనుంది. పెద్దల సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కానుంది. మార్చిలో బడ్జెట్ సమావేశాల తర్వాతే ఈ మార్పులు, చేర్పులు జరగనున్నాయి.