ఎన్నికలు అభ్యర్థుల ఎంపికపై అయోమయం
Published Sun, Mar 9 2014 11:00 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
2009 ఎన్నికల్లో మొత్తం ఏడు సీట్లను గెల్చుకున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇటీవల బాగా దిగజారినట్టు సర్వేల్లో తేలింది. ఆప్‌కు జనాదరణ అధికంగా ఉండడంతో బరిలోకి దిగడానికి బీజేపీ నాయకుల్లో చాలా మంది ఉత్సాహం చూపడం లేదు. దీంతో ఈ రెండు పార్టీలూ అభ్యర్థుల ఎంపికపై మీనమేషాలు లెక్కిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాత్రమే ఏడు స్థానాల్లో ఐదింటికి అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
న్యూఢిల్లీ: మరికొన్ని రోజుల్లో ఢిలీ, ఎన్సీఆర్‌లో లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ నిర్వహిస్తున్నా ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు ఇప్పటికీ అభ్యర్థులను ఎంపిక చేయలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాత్ర మే ఏడు స్థానాల్లో ఐదింటికి అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. వీటికి వచ్చే నెల 10న పోలింగ్ నిర్వహిస్తారు. ఎన్నికల సంఘం గణాం కాల ప్రకారం జనవరి 31 వరకు ఢిల్లీ ఓటర్ల సంఖ్య 1.2 కోట్లుగా తేలింది. ఏడు స్థానాల్లో ఒక సీటు ఎస్సీ అభ్యర్థికి కేటాయించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఏడు సీట్లను గెలిచిన పార్టీ ఈ ఎన్నికల్లో ఒక్కసీటును కూడా గెలుచుకోవడం కష్టమేనని రాజకీయ పండితులు అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్‌కు అతిపెద్ద ప్రతికూలతగా మారింది. దేశమంతటితో పోలిస్తే ఆప్ ఢిల్లీలోనే బలంగా ఉంది. అంతర్గత కలహాలు, ఆప్‌తో భారీ పోటీ, బలమైన నాయకుల కొరత బీజేపీకి ప్రధాన సమస్యలు.
అప్.. అందరి కంటే ముందు
ఆమ్ ఆద్మీ పార్టీ ఏడింట్లో ఐదు స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో ముందుంది. చాందినీచౌక్ నుంచి ఆశుతోష్, పశ్చిమ ఢిల్లీ నుంచి జర్నైల్ సింగ్, వాయవ్యఢిల్లీ స్థానం నుంచి మహేం దర్ సింగ్, ఈశాన్య ఢిల్లీలో ఆనంద్‌కుమార్, తూర్పు ఢిల్లీలో రాజ్‌మోహన్ గాంధీ ఇప్పటికే ఎన్నికల ప్రచారం ఆరంభించారు. కాంగ్రెస్ విషయానికి వస్తే న్యూఢిల్లీ నుంచి సిట్టింగ్ ఎంపీ అజయ్ మాకెన్‌కు టికెట్ దాదాపు ఖాయమైనట్లే. ఈశాన్య ఢిల్లీ నుంచి ఎవరు పోటీ చేస్తారన్నది ప్రైమరీ ద్వారా తేలనుంది. చాందినీచౌక్‌లో కపిల్ సిబల్‌కు టికెట్ ఇవ్వడం ఖాయంగా కనబడుతోంది. మిగతా నాలు గు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎంపీలకే అధిష్టానం టికెట్ ఇస్తుందా లేదా అన్నది చూడవలసి ఉంది.
కాంగ్రెస్‌కు కష్టాలే!
2009 ఎన్నికల్లో మొత్తం ఏడు సీట్లను గెల్చుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి అభ్యర్థుల ఎంపికపై మీనమీషాలు లెక్కిస్తోంది. అయితే గత ఐదేళ్లలో పార్టీ పరిస్థితి బాగా దిగజారినట్టు సర్వేల్లో తేలింది. ముఖ్యంగా ఆప్ అవిర్భావం తరువాత పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. దీనికితోడు అవినీతి, కుంభకోణాలు, ధరల పెరుగుదల వంటివి కాంగ్రెస్‌పై విముఖతను బాగా పెంచాయి. ఢిల్లీలో పట్టుకోసం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో పలు ర్యాలీలు నిర్వహించినా పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. ఈసారి ప్రధాన పోటీ ఆప్, బీజేపీ మధ్యే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల ఈ రెండు పార్టీల మధ్య ఘర్షణలు ముదరడం కూడా దీనికి సంకేతమని అంటున్నారు. అన్ని స్థాయుల్లోనూ ఆప్ కాంగ్రెస్‌ను దెబ్బతీసి ప్రధానపక్షంగా ఎదిగింది. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఈ పార్టీ ఇప్పటికే ఇద్దరు జర్నలిస్టులు, ఇద్దరు ప్రొఫెసర్లు, జర్నైల్‌సింగ్ అనే మాజీ జర్నలిస్టుకు లోక్‌సభ టికెట్లు ఇస్తున్నట్టు ప్రకటించింది. సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఒక సమయంలో ఆయన కేంద్రమంత్రి చిదంబరంపై చెప్పు విసిరి సంచలనం సృష్టించారు.
అంతర్గత కలహాలతో బీజేపీ సతమతం
నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని శతవిధాలా ప్రయత్నిస్తోన్న బీజేపీ పరిస్థితి గత లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు మెరుగైనప్పటికీ అంతర్గత కలహాలు ఆ పార్టీకి ఉన్న అతిపెద్ద సమస్య. ఏడు లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయానికి పార్టీ మీనమీషాలే లెక్కిస్తుండడమే దీనికి నిదర్శనం. ఆప్‌కు జనాదరణ అధికంగా ఉండడంతో బరిలోకి దిగడానికి బీజేపీ నాయకుల్లో చాలా మంది ఉత్సాహం చూపడం లేదు. అందుకే అధిష్టానం ప్రముఖ నాయకుల్లో కొందరు పోటీలో ఉండేలా సర్దిచెబుతోందని సమాచారం.
Advertisement