అన్న మీద పగతో రగులుతున్న చెల్లెమ్మ
చెన్నై: అమ్మ మెప్పుతో సీటు దక్కితే, తోడపుట్టిన చెల్లెమ్మ రూపంలో చిక్కులు ఎదురు కావడం అన్నాడీఎంకే అభ్యర్థిని ఇరకాటంలో పడ్డారు. సీటు ఉంటుందో, ఊడుతుందో అన్న డైలమాలో పడ్డారు. ఇంతకీ ఈ అభ్యర్థి ఎవరో కాదు సింగానల్లూరు సింగముత్తు. అన్నాడీఎంకేలో సీటు దక్కడం అంటే ఆషామాషీ కాదన్న విషయం తెలిసిందే. అదేసమయంలో చిన్న ఫిర్యాదు, ఆరోపణ వచ్చినా సీటు తక్షణం ఊడడం ఖాయం.
ఇలా అన్నాడీఎంకేలో పలువురి అభ్యర్థిత్వాలు తాజాగా రద్దు అయ్యాయి. మరి కొందరిపై వేటుకు రంగం సిద్ధం అవుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కోయంబత్తూరు జిల్లా సింగానల్లూరు అభ్యర్థి సింగముత్తుకు తోడ పుట్టిన చెల్లెమ్మ రూపంలోనే చిక్కులు ఎదురు కావడంతో సీటు ఉంటుందా? ఊడుతుందా? అని అన్నాడీఎంకే వర్గాలే పందెం కాస్తున్నాయట.
ఇంతకీ తోడపుట్టిన అన్న మీద ఆ చెల్లెమ్మకు కోపం ఏమిటంటే, ఆస్తుల పంపకాలు సరిగ్గా జరగలేదట. తోడ పుట్టినోడికి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా సింగనల్లూరులో నామినేషన్ దాఖలు చేసిన సింగముత్తు చెల్లెమ్మ ప్రభావతి మీడియాతో మాట్లాడుతూ... తన అన్నయ్య బండారాన్ని ప్రచారంలో ప్రజల ముందు పెట్టి తీరుతానని స్పష్టం చేస్తున్నారు.
ఇంత కోపం ఎందుకమ్మా అని ప్రశ్నిస్తే... తన సోదరుడు కోట్లు గడించాడని, తన తల్లి పేరిట ఉన్న 10 సెంట్ల భూమిని తనకు ఇవ్వకుండా అమ్మే యత్నం చేయడం వల్లే ఈ ‘పగ’అని జవాబిచ్చారు. ఇదే విషయాన్ని అమ్మ(జయలలిత)కు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అందుకే అన్నయ్యకు తగ్గ ప్రత్యర్థి తానేనంటూ ఆమె సెలవిచ్చారు. జయలలిత కరుణించి సీటును సింగముత్తుకే వదలి పెట్టినా, ఈ తోడ పుట్టిన చెల్లెమ్మ వదలి పెట్టేట్టు లేదంటూ సింగానల్లూరు ఓటర్లు చెవులు కొరుక్కుంటున్నారు.