దైవాదీనం.. | Private operators celagatam ... | Sakshi
Sakshi News home page

దైవాదీనం..

Published Fri, Nov 1 2013 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 12:10 AM

Private operators celagatam ...

 సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలోని వివిధ నగరాల్లో ముఖ్యంగా బెంగళూరులో వివిధ ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో బుధవారం తెల్లవారు జామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 45 మంది ప్రాణాలు గాలిలో కలసిపోయిన దుర్ఘటన అనంతరం, అలాంటి బస్సుల్లో పేలుడుకు కారకమయ్యే రసాయనాల రవాణాకు అనుమతించడంపై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యంగా కళాసిపాళ్య నుంచి నడుస్తున్న ప్రైవేట్ బస్సుల నిర్వాకంపై ఒకింత ఆగ్రహం వ్యక్తమవుతోంది. సాధారణంగా మల్టీ యాక్సిల్ బస్సుల్లో డీజిల్ ట్యాంకు డ్రైవర్ వెనుకే ఉంటుంది. అందులో 600 లీటర్ల దాకా డీజిల్  ఉంటుంది. ఇలాంటి దుర్ఘటన జరిగిన సమయాల్లో ట్యాంకుకు చిల్లు పడడం లాంటి సంఘటన చోటు చేసుకుంటే ప్రాణ నష్టం తీవ్రంగానే ఉంటుంది. దీనికి తోడు రసాయనాలు లాంటివి ఉంటే మంటలు వేగంగా వ్యాపించడంతో పాటు వాటి తీవ్రత కూడా అనూహ్యంగా ఉంటుందనడంలో సందేహం లేదు.
 
లగేజీ ఆదాయం కూడా ముఖ్యమే

 ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీలు కేవలం ప్రయాణికులను మాత్రమే నమ్ముకోవడం లేదు. వారి ద్వారా 70 శాతం ఆదాయం లభిస్తే, మిగిలిన 30 శాతం ఆదాయం లగేజీ నుంచే వస్తుంది. దీని వల్లే అనేక ట్రావెల్ ఏజెన్సీలు చట్ట విరుద్ధమైనా ఈ లగేజీలను యథేచ్ఛగా తరలిస్తున్నాయి. ప్రతి రోజూ సాయంత్రం పూట కళాసిపాళ్య బస్టాండులో లగేజీ రాశులు పోసి ఉంటుంది. వీటిలో రసాయనాలతో కూడిన క్యాన్లు కూడా ఉంటాయి. పెయింటింగ్, పెట్రో కెమికల్స్ లాంటి వాటిని ట్రావెల్స్ నిర్వాహకులు తరలించడం బహిరంగ రహస్యం. సుమారు 20 లీటర్లు ఉండే రసాయనాల క్యానుకు లగేజీ చార్జీగా రూ.300 వసూలు చేస్తారు.

ఇలాంటి రసాయనాలను తరలించేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదని కళాసిపాళ్య పోలీసులు చెబుతున్నారు. టూరిస్టు బస్సులను ప్రశ్నించే అధికారం తమకు లేదన్నారు. రోజూ రసాయనాలు ఇలా తమ ముందే సాగిపోతుంటాయని, ఎటువంటి ప్రమాదానికి దారి తీస్తాయోనని తాము ఆందోళన చెందిన సందర్భాలు కూడా లేకపోలేదని తెలిపారు. అయితే తాము నిస్సహాయులమని నిట్టూర్చారు. కళాసిపాళ్య నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు రోజూ ఎనభై బస్సులు వెళుతుంటాయి. ఈ బస్సులన్నీ ప్రయాణికుల కోసం ఎలా ఎదురు చూస్తుంటాయో, లగేజీల కోసం కూడా అదే విధంగా అర్రులు చాస్తుంటాయి.
 
అతి వేగం వల్లే అనర్థం

 మహబూబ్ నగర్ జిల్లాలో బస్సు దుర్ఘటనకు డ్రైవర్ అంతులేని వేగం కూడా కారణమేనని తెలుస్తోంది. బెంగళూరులో మంగళవారం రాత్రి సుమారు పది గంటలకు బయలుదేరిన బస్సు నగర శివార్లకు చేరుకునేసరికి 11 గంటలు పట్టింది. మధ్యలో టోల్, టీ, ఇతరత్రాల కోసం గంట వెచ్చించాల్సి ఉంటుంది.  ఐదు గంటల్లో డ్రైవరు సుమారు 500 కిలోమీటర్లు నడిపినట్లు తెలుస్తోంది. అంటే...మధ్యలో అప్పుడప్పుడూ బస్సును 130-140 కిలోమీటర్ల వేగంతో నడిపితేనే అంత దూరం వెళ్లడానికి వీలవుతుంది.

 ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీ బస్సుల డ్రైవర్లు ప్రయాణికుల కోసం పలు ప్రాంతాల్లో సమయాన్ని వృథా చేసి, స్పీడు ద్వారా అలా వృథా అయిన సమయాన్ని ఆదా చేయడానికి ప్రయత్నిస్తారు. అందరూ గాఢ నిద్రలో ఉంటారు కనుక, బస్సు వేగంపై ఎవరూ అభ్యంతరం చెప్పే అవకాశం కూడా ఉండదు. పైగా రోడ్డు ప్రమాదాలు ఉదయం నాలుగు, ఆరు గంటల మధ్యే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎంతటి డ్రైవరైనా ఏదో ఒక సమయంలో రెప్ప వాల్చే అవకాశం లేకపోలేదు. అలాంటి సమయంలో బస్సు వేగంగా వెళుతుంటే, అదుపు చేయడం ఎవరికీ సాధ్యం కాదు. జబ్బార్ ట్రావెల్స్ బస్సు విషయంలో కూడా అదే జరిగి ఉంటుందని పలువురు భావిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement