► రెండు రోజుల్లో రూ.1300 కోట్ల డిపాజిట్లు
► బ్యాంకుల వద్ద అదే రద్దీ
► ఏటీఎంలతో అవస్థలు
► మరో మూడు రోజులు పాతనోట్లు
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెల్లని కరెన్సీని కొత్త నోట్లుగా మార్చుకునేందుకు రాష్ట్ర ప్రజలు పరుగులు తీసిన ఫలితంగా రెండు రోజుల్లో రూ.1300 కోట్ల నగదు బ్యాంకుల్లో డిపాజిట్ అయింది. ఇంకా కోట్లాది రూపాయల నగదును జమ చేసేందుకు అన్ని బ్యాంకుల వద్ద శనివారం సైతం అదే రద్దీ కొనసాగుతోంది. ఈనెల 13వ తేదీ (ఆదివారం) అన్ని బ్యాంకులు పనిచేస్తాయి. అయితే ఆ తరువాత నుంచి బ్యాంకులు యథావిధిగా సెలవు దినాలను అమలు చేస్తాయని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) శనివారం ప్రకటించింది.
కొన్ని దశాబ్దాలుగా చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లు చెల్లవంటూ మూడు రోజుల క్రితం కేంద్రం ప్రకటించడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. పేద ప్రజానీకం నుంచి పెద్ద కోటీశ్వరుని వరకు వెంటనే తమ బీరువాలను తెరిచి కరెన్సీ లెక్కలు చూసుకున్నారు. పాత నోట్ల స్థానంలో కొత్త నోట్లను పొందేందుకు బ్యాంకుల వద్ద బారులు తీరడం ప్రారంభించారు. ఖాతాదారుల అవసరాల దృష్ట్యా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బ్యాంకులు పనిచేయడం ప్రారంభించాయి. అనేక బ్యాంకుల్లో కేవలం రూ.2000 నోట్లు మాత్రమే అందుబాటులో ఉండడంతో గంటల తరబడి క్యూలో నిల్చున్నవారు నిరాశ చెందుతున్నారు. రూ.100 నోట్లు కనీసం రూ.500 నోట్లుగా సరిపడా చిల్లర లేనిదే అవసరాలు ఎలా తీరుతాయని బ్యాంకు సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. బ్యాంకులకు సైతం చిల్లర నోట్లు సరఫరా లేకపోవడంతో అధికారులను ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారు.
రూ.500 నోట్లు ఈనెల 14వ తేదీన విడుదల అవుతాయని బ్యాంకు అధికారులు భరోసా ఇచ్చి పంపుతున్నారు. చిల్లర కొరత తీర్చేందుకు గతంలో చెలామణిలో ఉన్న రూ.100 నోట్లను మళ్లీ విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈనెల 11వ తేదీ నుంచి ఏటీఎంల ద్వారా యథావిధిగా సొమ్మును డ్రా చేసుకోవచ్చని ప్రకటించిన బ్యాంకులు ఖాతాదారులను నిరాశపరిచాయి. అనేక ఏటీఎంలను శుక్ర, శనివారాల్లో తీయలేదు. ఏటీఎంలో అమర్చే స్థారుులో నగదు అందలేదని బ్యాంకు ఉద్యోగుల సంఘం నేతలు చెబుతున్నారు. అయితే మధురై జిల్లాలో కొన్ని బ్యాంకులు సంచార ఏటీఎం కేంద్రాలను సిద్ధం చేసుకుని గ్రామాల్లో తిరుగుతూ కరెన్సీ మార్పిడి చేస్తున్నారు.
పెట్రోలు బంకులు, ఆసుపత్రులు, ఫార్మసీ దుకాణాలు, విద్యుత్, బీఎస్‌ఎన్‌ఎల్ బిల్లుల చెల్లింపు, కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో పన్ను చెల్లింపులు వంటి అత్యవసర సేవల్లో మరో మూడు రోజులపాటూ పాత నోట్లనే వినియోగించేలా ప్రభుత్వం గడువు పొడిగించింది. శనివారంతో గడువు ముగుస్తుందని బెంబేలు పడిన ప్రజలు ఈ రెండురోజుల్లో రూ.200 కోట్ల విద్యుత్ బిల్లులు చెల్లించడం విశేషం.
పెళ్లి ఖర్చులకు తండ్రి తపన: చెన్నైకి చెందిన ఎస్ రవిచంద్రన్ తన కుమార్తె గాయత్రిని వసంత్ అనే వరుడికిచ్చి ఈనెల 11వ తేదీన వివాహం చేశారు. వివాహ ఖర్చుల నిమిత్తం కూడబెట్టుకున్న రూ.2లక్షల సొమ్ములో అధికశాతం కేంద్రం రద్దు చేసిన చెల్లని నోట్లు ఉన్నారుు. బ్యాంకులో మార్చేందుకు వెళ్లినా కేవలం రూ.4వేలు మాత్రమే లభిస్తుందని తెలుసుకున్న రవిచంద్రన్ చెన్నై సచివాలయం పక్కనే ఉన్న రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర కార్యాలయానికి వెళ్లాడు. తన కుమార్తె పెళ్లి విషయం చెప్పుకుని బోరుమన్నాడు. అరుుతే అధికారులు ఆయన మొరాలకించలేదు. మూడు గంటల పాటూ బ్యాంకు వద్ద పడిగాపులు కాస్తే రూ.8వేలకు మాత్రమే కొత్త కరెన్సీని ఇచ్చి పంపివేశారు. తన బాధ ఎవ్వరికి చెప్పుకునేది, తన వద్దనున్న రూ.2లక్షలు ఎందుకూ పనికిరాకుండా పోయాయని రవిచంద్రన్ బావురుమన్నాడు.
నాడు వరద పోటు...నేడు కరెన్సీ వేటు
నవంబరు నెల తమకు చేదు అనుభవమని చెన్నై ప్రజలు చెప్పుకుంటున్నారు. గత ఏడాది నవంబర్‌లో భారీ వర్షాలు కురిసి ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు. ఎడతెరిపి లేని వర్షాలు చెన్నై ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశారుు. నీట మునిగి ఇళ్లలోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. అలాగే ఈ ఏడాది కరెన్సీ నోట్ల రద్దు చేయడంతో కొత్త కరెన్సీ కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చిందని పోల్చుకుంటున్నారు. గత ఏడాది ప్రకృతి, ఈ ఏడాది ప్రభుత్వం తమను రోడ్డు పాలు చేసిందని ప్రజలు వాపోతున్నారు.
వామ్మో...సొమ్ము
Published Sun, Nov 13 2016 3:17 AM | Last Updated on Wed, Oct 17 2018 4:10 PM
Advertisement