సిరా చుక్క పెట్టుకోండి.. చిల్లర తీసుకోండి!
హైదరాబాద్: ‘ధనమొస్తే దాచుకోవాలి రోగం వస్తే చెప్పుకోవాలి’ అంటారు. అయితే ఇప్పుడు జనమందరూ తమదగ్గరున్న డబ్బుతో బ్యాంకులు, పోస్టాఫీసులకు పరుగులు పెడుతున్నారు. పెద్ద నోట్లు తీసుకుని, చిన్న నోట్లు ఇవ్వాలని అధికారులకు మొర పెట్టుకుంటున్నారు. ‘పాత పెద్ద నోట్లు వద్దు.. కొత్త నోట్లు ముద్దు’ అంటున్నారు. రూ. 500, రూ. వెయ్యి నోట్లను కేంద్రం రద్దు చేయడంతో పెద్ద నోట్లను మార్చుకునేందుకు జనం బ్యాంకులు, పోస్టాఫీసుల ముందు గురువారం బారులు తీరారు. తండోపతండాలు తరలివస్తున్న ప్రజలకు కొత్త, చిన్న నోట్లు ఇచ్చేందుకు బ్యాంకు సిబ్బందికి తలప్రాణం తోకకువస్తోంది. దీంతో ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి.
** హైదరాబాద్ ఆర్ బీఐ కార్యాలయంలో నోట్ల కోసం జనం బారులు తీరారు. నోట్లు మార్చుకున్నవారికి చేతి వేలిపై బ్యాంకు సిబ్బంది సిరా గుర్తు వేస్తున్నారు.
** హైదరాబాద్ బంజారాహిల్స్ పోస్టాఫీసులో కొత్త నోట్లు రాలేదని అధికారులు తెలపడంతో జనం నిరాశతో వెనుదిరుగుతున్నారు.
** విశాఖపట్నం జోన్ లోని 78 బ్యాంకు బ్రాంచీల్లో నోట్ల మార్పిడి జరుగుతోంది. బ్యాంకుల ముందు వరుసలో నిలబడిన వారికి ప్రత్యేక కూపన్లు ఇస్తున్నారు. ఏజెన్సీలో కరెంట్ లేకపోవడంతో ఇన్వర్టర్లపైనే బ్యాంకు లావాదేవీలు నిర్వహిస్తున్నారు.
** గుంటూరు జిల్లాలోని బ్యాంకులకు కొత్త రూ. 500 కోట్లు ఇంకా చేరలేదు. దీంతో పాత నోట్లకు బదులు రూ.100, రూ. 2000 నోట్లు ఇస్తున్నారు.
** విజయవాడలో అన్ని బ్యాంకుల్లో జనం బారులు తీరారు. దుర్గగుడిలో సైతం రద్దు చేసిన నోట్లు వేయవద్దని భక్తులను సిబ్బంది కోరుతున్నారు.
** పెద్ద నోట్ల మార్పిడి చేయకుండా డిపాజిట్లు మాత్రమే సేకరిస్తున్నారని కర్నూలు ప్రధాన పోస్టాఫీసు వద్ద జనం ఆగ్రహం వ్యక్తం చేశారు.
** హైదరాబాద్ ఫారెన్ ఎక్స్ఛేంజీలో విదేశీ నగదు మారకం పూర్తిగా నిలిపివేశారు. తమకు వెసులుబాటు కల్పించాలని ఫారెన్ ఎక్స్ఛేంజీ ప్రతినిధులు కోరుతున్నారు.
** కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఎస్ బీహెచ్ ముందు వరుసలో నిలబడిన గంగారాం అనే విద్యార్థి స్పృహ తప్పి పడిపోవడంతో కలకలం రేగింది.
కొసమెరుపు: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కొన్ని బ్యాంకుల ముందు, ప్రత్యేక కార్యక్రమాలు... శుభకార్యాలకు వేసినట్టుగా టెంట్లు వేశారు.