నగదు మార్చుకోగానే ఇంక్ మార్క్!
ఢిల్లీ: పెద్దనోట్ల రద్దు వల్ల కొంతమంది వ్యక్తులు బ్యాంకులకు వెళ్లి పదే పదే డబ్బులు మారుస్తున్నారని కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ తెలిపారు. కొందరు వ్యక్తులు ఈ విధంగా పదే పదే బ్యాంకులకు రావడంతో ఇతరులకు అవకాశం లేకుండా చేస్తున్నారని.. దీన్ని నిరోధించడంలో భాగంగా ఇంక్ మార్క్ వేయనున్నట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. కొందరు వ్యక్తులు పదే పదే రావడం వల్లే బ్యాంకుల వద్ద రద్దీ బాగా పెరిగిందని, నల్లధనం ఉన్న వ్యక్తులు పెద్ద సంఖ్యలో వ్యక్తులను బ్యాంకులకు పంపిస్తున్నారని శక్తికాంత్ దాస్ చెప్పారు. జన్‌ధన్ అకౌంట్లలో రూ.50 వేలు వరకు మాత్రమే డిపాజిట్ చేయవచ్చు అన్నారు.
'నకిలీ నోట్ల నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటుచేశాం. బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో నగదు పంపిణీ పెంచాం. కొన్ని సంస్థలు సమ్మెలోకి వెళ్తున్నాయంటూ వచ్చిన వదంతులను నమ్మవద్దు. జన్‌ధన్ యోజన అకౌంట్లపై దృష్టి పెడుతున్నాం' అని ఆర్థికశాఖ కార్యదర్శి పేర్కొన్నారు.ప్రాథమిక అవసరాలకు తమ వద్ద ఉన్న పాత కరెన్సీని మార్చుకునేందుకు బ్యాంకులకు తరలివస్తున్న జనాలకు ఇక్కట్లు తప్పడం లేదు. బ్యాంకుల వద్ద పెద్ద సంఖ్యలో జనాలు ఉండటంతో సమయం వృథా అవుతుందని వాపోతున్నారు. బ్యాంకుల్లో రోజుకు రూ.4000 నుంచి రూ.4500 కు పాతకరెన్సీని మార్చుకునే వెసలుబాటు ఉంది.