నైపుణ్యం పెరగాలి
Published Wed, Oct 30 2013 3:33 AM | Last Updated on Sat, Sep 2 2017 12:06 AM
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : భారతీయ సినిమాలో దక్షిణ భారత దేశం వాటా 70 శాతానికి పైగానే ఉన్నందున ఈ రంగంలో నిపుణులను తయారు చేయాల్సిన అవసరం ఉందని ప్రముఖ నటుడు కమలహాసన్ అన్నారు. ఇక్కడి ఓ హోటల్‌లో మంగళవారం ప్రారంభమైన రెండు రోజుల ‘మాధ్యమ, వినోద వాణిజ్య సమ్మేళనంలో’ ఆయన ప్రసంగించారు. నైపుణ్యంతో పాటు డిజిటలైజేషన్‌లో ప్రత్యేక శిక్షణను ఇవ్వడం ద్వారా నిపుణులను తయారు చేయాల్సిన ఆగత్యం ఉందన్నారు. డిజిటలైజేషన్, తదితర విభాగాల్లో ఇప్పటికే సాధించిన ప్రగతిని ప్రశంసిస్తూనే, మరింత పురోగతి సాధించాల్సి ఉందని చెప్పారు. ఇప్పటికే ఉత్తమ నాణ్యతా ప్రమాణాలతో కూడిన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నప్పటికీ, అవింకా ఎక్కువ కావాల్సి ఉందన్నారు.
మానవ వనరులతో
ఉపాధి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నందున ఈ రంగం అభివృద్ధికి ఊతంగా పలు కార్యక్రమాలను చేపట్టాల్సి ఉందన్నారు. ఇందులో భాగంగా ఐఐటీ, మేనేజ్‌మెంట్ కోర్సుల్లో మాధ్యమం, వినోదం అంశాలను కూడా చేర్చాలని సూచించారు. టీవీ తొలి స్థానంలో ఉండగా, ప్రింట్ మీడియా రెండు, సినిమా మూడు స్థానాల్లో ఉన్నాయని ఆయన వివరించారు. నటుడు, గృహ నిర్మాణ శాఖ మంత్రి అంబరీశ్ మాట్లాడుతూ విదేశీయులను తొలుత ముంబై, ఢిల్లీ నగరాలు ఆకర్షించేవని, ఐటీ విప్లవం తర్వాత ఇప్పుడు బెంగళూరు కూడా ప్రధాన నగరంగా మారిందని అన్నారు. ఇక్కడ సినిమా రంగంలో అత్యుత్తమ స్టూడియో, ఇతర సదుపాయాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.
Advertisement