సాక్షి, న్యూఢిల్లీ:పదిహేనే ళ్ల పాలనలో ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ నగరాన్ని అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చేశారని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశంసించారు. ఢిల్లీ నగర సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, మరోమారు ప్రజలు ఆదరించాలని నగరవాసులకు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం అంబేద్కర్‌నగర్‌లో నిర్వహించిన మమ్మత్ ర్యాలీలో ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్, డీపీసీసీ అధ్యక్షుడు జేపీ అగర్వాల్, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఎన్నికల ఇన్‌చార్జి షకీల్ అహ్మద్‌తో కలిసి పాల్గొన్నారు. బీజేపీ తప్పుడు వాగ్ధానాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తోందని రాహుల్ విమర్శించారు. ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఢిల్లీలోని పేద, బలహీన వర్గాల ప్రజల్లో ఎంతో మార్పు తీసుకువచ్చిందన్నారు. పదిహేనేళ్లలో వినూత్న మార్పులు వచ్చాయన్నారు.
ప్రపంచంలోనే అత్యున్నత మెట్రో రైలుతోపాటు ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు కల్పించారన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఢిల్లీ నగరాన్ని మరింతగా అభివృద్ధి చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మెట్రో రైలు మార్గాలను విస్తరించడంతోపాటు మోనోరైలును అందుబాటులోకి తెస్తామన్నారు. ఢిల్లీలోని ఉపాధి అవకాశాలతో దేశంలోని నలుమూలల నుంచి ఎంతోమంది వలసలు వస్తున్నారన్నారు. తన కుటుంబం సైతం ఢిల్లీకి వలస వచ్చిందని పేర్కొన్నారు. పదిహేనేళ్లలో తమ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి సంక్షేమ పథకాలే మరోమారు అధికారంలోకి తీసుకువస్తాయని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రావడానికి బీజేపీ నాయకులు చేస్తున్న తప్పుడు వాగ్ధానాలను ఢిల్లీవాసులు నమ్మబోరన్నారు.
అధికారమిస్తే వెండింగ్ మెషీన్‌ల ఏర్పాటు
కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకొస్తే మదర్ డెయిరీ తరహాలో రాయితీ ఆహార ధాన్యాల కోసం వెండింగ్ మెషీన్‌లను అమరుస్తామని సీఎం షీలా దీక్షిత్ హామీని ఇచ్చారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలవారు రేషన్ దుకాణాలకు వెళ్లినప్పుడు తక్కువ మోతాదులో ఆహార ధాన్యాలు ఉండటం, మొత్తానికి అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు వెండింగ్ మెషీన్‌లను ఏర్పాటుచేయాల్సిన అవసరముందన్నారు. అంబేద్కర్ నగర్‌లోని ఎన్నికల ర్యాలీలో ఆమె ఆదివారం పాల్గొని ప్రసంగించారు. ‘టోకెన్ల ద్వారా మదర్ డెయిరీ కేంద్రాల్లో పాలను ప్రజలు కొనుగోలు చేస్తున్నారు.
అదే తరహాలో రేషన్ దుకాణాల్లో రాయితీకి వచ్చే గోధుమలు, బియ్యం, పప్పులు కొనుగోలు చేసేం దుకు వచ్చే సామాన్యుల కోసం వెండింగ్ మెషీన్‌లను అమరుస్తామ’ని అన్నారు. గత 15 ఏళ్లలో చేపట్టిన మౌలిక వసతుల అభివృద్ధి గురించి ఏకరువు పెట్టారు. తమను అధికారంలోకి తీసుకొస్తే వచ్చే ఐదేళ్లలో ప్రజల తలసరి ఆదాయం ప్రస్తుతమున్న దానికి రెండింతలు చేస్తామని అన్నారు. ‘ఢిల్లీలో తలసరి ఆదాయం ఎక్కువగానే ఉంది. అయినా వచ్చే ఐదేళ్లలో రెండింతలు చేయాలనుకుంటున్నాం. ప్రస్తుతం ఏడాదికి రూ.రెండు లక్షలు సంపాదించే ప్రజలు అప్పటికీ నాలుగు నుంచి ఐదు లక్షలు సంపాదించేలా చర్యలు తీసుకుంటామ’ని తెలి పారు. జీవనోపాధి కోసం రోడ్డు పక్కన చిన్నచితక వ్యాపారాలు నిర్వహించే హాకర్ల కోసం ప్రత్యేక వ్యాపార జోన్‌లను ఏర్పాటుచేస్తామని హామీనిచ్చారు.
వీరికి ప్రత్యేక జోన్‌లను నిర్మిస్తామని, దీంతో వ్యాపారం సజావుగా నిర్వహించుకోవచ్చన్నారు. పోలీసులు, కార్పొరేషన్‌ల వేధింపులు అప్పుడు ఉండవని తెలిపారు. నగరంలో పరిశుభ్రతను మరింత మెరుగుపరచాల్సిన అవసరముందన్నారు. ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలో మరుగుదోడ్లు నిర్మించాలని తెలిపారు. బాధ్యతాయుతం గా వ్యవహరించే ప్రభుత్వానికే ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తప్పుడు హామీలిచ్చే ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, ఏఏపీలను నమ్మొద్దని కోరారు. ఢిల్లీలో మహిళలకు భద్రత లేదని ఆరోపిస్తున్న బీజేపీ వారికి ఏ విధంగా రక్షణ కల్పిస్తోందో వివరించాలని అన్నారు. పార్టీకి నిధులు ఎలా వచ్చా యో తెలపాలని ఏఏపీ అధ్యక్షుడు కేజ్రీవాల్‌ను నిలదీశారు. పెరిగిన ఉల్లి, ఆలుగడ్డ ధరలను నియంత్రించేందుకు ఇప్పటికే తక్కువ రేట్లకు కూరగాయలు విక్రయించే ఏర్పాట్లు చేశామన్నారు.
మళ్లీ ‘చే’యూతనివ్వండి
Published Sun, Nov 17 2013 11:19 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement