సాక్షి, ముంబై: కేంద్ర రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున్ కర్గే తొలిసారిగా ప్రవేశపెట్టిన 2014-15 మధ్యంతర రైల్వే బడ్జెట్ రాష్ట్రంలోని తెలుగు ప్రజలకు నిరాశను కలిగించింది. ప్రయాణికులపై ఎలాంటి భారం వెయ్యనప్పటికీ ముంబైతోపాటు రాష్ట్రంలో నివసించే తెలుగు ప్రజలకు మాత్రం ఈ బడ్జెట్‌తో పెద్దగా ఒరిగిందేమిలేదు. ఒక ముంబై-చెన్నై మార్గంలో వారికి మినహా మిగతా ప్రాంతాల్లో నివసించే తెలుగు ప్రజలందరికి ఖర్గే మొండిచేయి చూపించారు.
అయితే రాష్ట్రంలోని ప్రయాణికులందరిని దృష్టిలో ఉంచుకుంటే మాత్రం బడ్జెట్ బాగానే ఉందని రాష్ర్టవాసులందరూ చర్చించుకుంటున్నారు. ఇక రాష్ట్రంలో ప్రధాన కార్యాలయాలు ఉన్న పశ్చిమ, సెంట్రల్ రైల్వే మార్గాలలో తొమ్మిది ప్రీమియం (సెంట్రల్ నాలుగు, వెస్ట్రన్ ఐదు), 17 ఎక్స్‌ప్రెస్ (సెంట్రల్ ఏడు, వెస్ట్రన్ తొమ్మిది, దక్షిణ మధ్య జోన్‌లో ఒకటి) రైళ్లు కొత్తగా ప్రకటించారు. వీటిలో పశ్చిమ రైల్వే మార్గంలో ప్రకటించిన అనేక రైళ్లు గుజరాతీయులకు ఎక్కువగా అనుకూలంగా ఉన్నాయి.
అయితే సెంట్రల్ రైల్వే మార్గం మీదుగా ప్రకటించిన కొత్త రైళ్లు రాష్ట్ర ప్రజలకు ఎంతో ఉపయోగపడనున్నాయి. వీటితోపాటు మరొక కొత్త రైలు మాత్రం దక్షిణ మధ్య జోన్‌లోని నాందేడ్-ఔరంగాబాద్‌ల మధ్య ప్రకటించారు. రాష్ట్రం మీదుగా వెళ్లే ఈ రైళ్లలో రెండు ప్రీమియం, ఐదు ఎక్స్‌ప్రెస్ రైళ్లు కర్ణాటక మీదుగా వెళ్లేవి ఉన్నాయి.
ముంబై నుంచి....
రైల్వే బడ్జెట్‌లో మల్లికార్జున్ ఖర్గే కొత్తగా ప్రకటించిన రైళ్లలో ముంబైకి మొత్తం 10 రైళ్లు లభించాయి. వీటిలో సెంట్రల్ రైల్వే మార్గంలో ఆరు రైళ్లు, పశ్చిమ రైల్వే మార్గంలో నాలుగు రైళ్లు ఉన్నాయి. ఈ రైళ్లలో తెలుగు ప్రజలకు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు మాత్రం ఒకే ఒక్క రైలుంది. ముంబై- చెన్నై ఎక్స్‌ప్రెస్ ఒక్కటే అదోని, కడప, గుంతకల్ తదితర ప్రాంతాలమీదుగా వెళ్లనుంది. మిగతావాటిలో ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్లే రైళ్లు లేవు.
దీంతో ముంబైలో నివసించే తెలుగు ప్రజల్లో కొంత నిరసన వ్యక్తమవుతోంది. ఇటీవలే ప్రారంభించిన ఎల్‌టీటీ-నిజామాబాద్, ఎల్‌టీటీ-కాకినాడ ఎక్స్‌ప్రెస్‌ల సర్వీసులైనా కనీసం పెంచుతారని భావిస్తే అది కూడా జరగలేదు. ఎల్‌టీటీ- నిజామాబాద్ రైలును డైలీ చేయడంతోపాటు ఠాణేలో కూడా స్టాప్ ఇవ్వాలని తెలుగు ప్రజలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై కూడా బడ్జెట్‌లో ఎలాంటి ప్రస్తావన లేదు. మరోవైపు ముంబై నుంచి హైదరాబాద్‌కు వయా నిజామాబాద్ మీదుగా మరో కొత్త రైలును ప్రకటించాల్సిన అవసరం ఉందని తెలుగు ప్రజలు డిమాండ్ చేస్తున్నా అలాంటిదేమీ జరగలేదు.
ఐదు ప్యాసింజర్లు...
రాష్ట్రంలో ఐదు కొత్త ప్యాసింజర్ రైళ్లను ఈసారి బడ్జెట్‌లో ప్రకటించారు. వీటిలో ప్రధానంగా నిమచ్-హింగోళి, కరాడ్-పండర్‌పూర్, పుణే-మోర్‌గావ్, పుణే-అహ్మద్‌నగర్, పుణే-కొల్హాపూర్‌లు ఉన్నాయి.
కొత్త మార్గాలు...
ఈ బడ్జెట్‌లో పలు కొత్త రైల్వేమార్గాలను ప్రతిపాదించారు. వీటిలో రాష్ట్రానికి సంబంధించి ఆరు మార్గాల ప్రస్తావన ఉంది. వీటిలో పుణే - అహ్మద్‌నగర్ వయా కెడాగావ్ కస్తీతోపాటు పుణే - బారామతి వయా సాసవాడ్, జేజూరి, మోరేగావ్ మార్గాలున్నాయి. కరాడ్ - కడేగావ్ - ఖర్సుంది - అట్టపడి - దిగాంచి -మహుద్ - పండర్‌పూర్, బెతూల్ - చందూర్‌బజార్ - అమరావతి మార్గం, ఘాటనందూర్ - శ్రీగోండా రోడ్డు/దౌండ్ వయా కైజ్, మంజార్సుంబా, పటోదా, జామ్ఖేడ్ మార్గాలు ఉన్నాయి. మరోవైపు లాతూర్ రోడ్డు-కుర్దువాడి, పుణే-కొల్హాపూర్ మార్గాలను డబ్లింగ్ చేయనున్నట్టు ప్రతిపాదించారు.
ప్రధానమైన కొత్త ప్రీమియం రైళ్లు...
పుణే-హౌడా వయా మన్మాడ్, నాగపూర్ (ఏసీ ఎక్స్‌ప్రెస్, వారానికి రెండుసార్లు).
ముంబై-హౌడా వయా నాగపూర్, రాయిపూర్ (ఏసీ ఎక్స్‌ప్రెస్, వారానికి రెండుసార్లు).
నిజాముద్దీన్-మడ్‌గావ్ వయా వసాయి రోడ్డు (ఏసీ ఎక్స్‌ప్రెస్ వారానికి రెండుసార్లు).
యశ్వంత్‌పూర్-జైపూర్ వయా పుణే, వసాయి రోడ్డు (ఏసీ ఎక్స్‌ప్రెస్, వారానికి ఒకసారి).
ప్రధానమైన కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లు...
ముంబై-చెన్నై ఎక్స్‌ప్రెస్ (వారానికి ఒకసారి)
ముంబై-హుబ్లీ ఎక్స్‌ప్రెస్ వయా షోలాపూర్, బీజాపూర్ (వారానికి ఒకసారి)
ముంబై-కార్మాలి ఎక్స్‌ప్రెస్ వయా రోహ (ఏసీ ఎక్స్‌ప్రెస్, వారానికి ఒకసారి)
ఔరంగాబాద్-నాందేడ్ ఎక్స్‌ప్రెస్,తిరువనంతపురం-నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ (వారానికి ఒకసారి)
తెలుగు ప్రజలకు మొండిచేయి
Published Wed, Feb 12 2014 10:55 PM | Last Updated on Mon, Oct 8 2018 9:17 PM
Advertisement