రజనీకి రాజకీయ ఆహ్వానం
Published Mon, Sep 16 2013 4:11 AM | Last Updated on Fri, Sep 1 2017 10:45 PM
సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ ఆహ్వానం రజనీ అభిమానుల్లో ఆనందం నింపుతోంది. తలైవా...వా అన్న నినాదం ఊపందుకుంటోంది.
సాక్షి, చెన్నై: దక్షిణ భారత సినీ వినీలాకాశంలో తిరుగులేని కథానాయకుడిగా పేరు పొందారు రజనీకాంత్. ఆయన రాజకీయ ప్రవేశంపై చాలా కాలంగా ఉత్కంఠ నెలకొంది. గతంలో రజనీకాంత్ ఇచ్చిన ఓ సంకేతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయూంశమైంది. రాజకీయ సంకేతంగా ఆయన గళం విప్పడం అభిమానుల్లో ఉత్తేజం నింపింది. తర్వాత విడుదలైన చిత్రాల్లో రాజకీయ డైలాగులు పేలడంతో రజనీ రాజకీయ ప్రవేశంపై చర్చ తీవ్రమైంది. రాజకీయాల్లోకి ఎప్పుడు రావాలో, ఎలా రావాలో, రావాల్సిన సమయంలో వస్తా అంటూ ఆయన పేల్చిన డైలాగులు అభిమానుల్ని ఉర్రూతలూగించాయి. రజనీ రాజకీయ అరంగేట్రం చేయాల్సిందేనన్న నినాదంలో అభిమానులు ఉద్యమించారు. రజనీ మాత్రం మౌనం వహించారు.
రానురాను అభిమానుల చర్యలు శ్రుతి మించడంతో సూపర్‌స్టార్ మౌనం వీడారు. అభిమానుల్ని బుజ్జగించారు. దేవుడు ఆదేశిస్తే ఈ రజనీ పాటిస్తాడు అని మెళిక పెట్టి అందరి నోళ్లు మూయించారు. కొంత కాలం రజనీ రాజకీయ ప్రవేశ చర్చ తెర మరుగైంది. కథానాయకుడు, రోబో చిత్రాలతో ఆయన బిజీ అయ్యారు. రాణా మొదలైనా రజనీ అనారోగ్య కారణాలతో ఆగింది. ప్రస్తుతం కోచ్చడయాన్( విక్రమసింహా)పై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో బీజేపీ తరపు ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ పేరు ప్రకటించడం రజనీని ఇరకాటంలో పెడుతోంది. మోడీతో రజనీకి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు, అందువల్లే గతంలో ఆయన రాజకీయ సంకేతం ఇచ్చినట్లు ఓ ప్రచారం ఉంది.
రాజకీయూల్లోకి రా
మోడీ ప్రధాని అభ్యర్థితత్వం ఖరారు కావడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ శనివారం పెదవి విప్పారు. రజనీకాంత్ ఇప్పుడైనా సరైన నిర్ణయం తీసుకోవాలని సూచిస్తూ రాజకీయాల్లో రా..కథానాయకుడా అన్న పిలుపుతో కూడిన సంకేతం ఇచ్చారు. ఇది వినడానికి బాగానే ఉన్నా రజనీకి మాత్రం సంకట పరిస్థితుల్ని సృష్టించడం ఖాయం. రజనీ రాజకీయ ప్రవేశం గురించి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులు సందు దొరికితే చాలు జెండాలు చేత పట్టేస్తున్నారు. రాధాకృష్ణన్ పిలుపును రజనీ అభిమానులు స్వాగతిస్తున్నారు. కొత్త పార్టీ లక్ష్యంగా, రాజకీయ ప్రవేశం చేయడం ధ్యేయంగా తమ కథానాయకుడి మీద ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు అద్దం పట్టే రీతిలో ఆదివారం తిరుచెందూరులోని సుబ్రమణ్య స్వామి ఆలయంలో రజనీ అభిమానులు హోమం, పూజలు నిర్వహించారు.
Advertisement
Advertisement