సాక్షి, ముంబై: నగరంలో శవాలను భద్రపరిచే రాజావాడి ఆస్పత్రి అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. 27 ఏళ్ల కిందట నిర్మించిన ఈ కేంద్రం పట్టించుకునే నాథుడు లేక శిథిలావస్థకు చేరుకుంది. రోజురోజుకు శవాల సంఖ్య పెరుగుతున్నా ఆస్పత్రి సామర్థ్యం మాత్రం పెరగలేదు. గతంలో కొలాబా, బాంద్రా, వడాల ప్రాంతంలోని మృత దేహాలను పోస్టుమార్టం కోసం జే.జే.ఆస్పత్రిలోని కెరోనరీ కోర్టుకి తీసుకొచ్చేవారు. బాంద్రా, దహిసర్ ప్రాంత మృతదేహాలను కూపర్ ఆస్పత్రికి, వడాల, ములుండ్ ప్రాంత మృత దేహాలను రాజావాడికి ఆస్పత్రికి తీసుకొచ్చేవారు.
కాగా 1999 జూలై 26న కెరోనరీ కోర్టును మూసివేసి పోలీసు శాఖకు అప్పగించారు. దీంతో ప్రస్తుతం రాజావాడి ఆస్పత్రిలోనే పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.
పాడవుతున్న ర్యాక్‌లు...సిబ్బందికి ఇబ్బంది
1988లో నిర్మించిన ఈ కేంద్రంలో 45 మృతదేహాలను భద్రపరిచే సామర్థ్యం ఉంది. 21 పోలీసు స్టేషన్‌ల పరిధి నుంచి మృత దేహాలు ఇక్కడికి తీసుకొస్తారు. శవాలను భద్రపరిచేందుకు ర్యాక్‌లు ఖాళీ లేకపోవడంతో అత్యవసర సమయంలో నేల పైనే ఉంచాల్సివస్తోంది. దీంతో సిబ్బందికి ఇబ్బందులు పడుతున్నారు. అనాథ శవాలను ఎక్కువరోజులు భద్రపరచాల్సి వస్తోందని, దీంతో ర్యాక్‌లు పాడైపోతున్నాయని డాక్టర్లు అంటున్నారు.
ఆస్పత్రిలోని ఏసీ యంత్రాలు కూడా పాతకాలం నాటివి కావడంతో తరుచూ మరమ్మతులు చేయాల్సి వస్తోంది. మహానగర పాలక సంస్థ (బీఎంసీ)కి చెందిన ఈ కేంద్ర స్థలం అద్దె విషయంపై బీఎంసీ, హోం శాఖ మధ్య వాగ్వాదం మరింత ముదురుతోంది. ఇప్పటికైనా ఆస్పత్రి అభివృద్ధికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆస్పత్రివర్గాలు కోరుతున్నాయి.
సమస్యల వలయంలో రాజావాడి ఆస్పత్రి
Published Mon, Mar 2 2015 10:58 PM | Last Updated on Sat, Sep 2 2017 10:11 PM
Advertisement
Advertisement