* 17న మెడిసిన్ ర్యాంకుల జాబితా
* 20 నుంచి 25వ తేదీ వరకు కౌన్సెలింగ్
సాక్షి, చెన్నై: దరఖాస్తుల పర్వం ముగియడంతో ర్యాండం నంబర్లను వైద్య విద్యా శాఖ ప్రకటించింది. ఈనెల 17న ర్యాంకుల జాబితాను ప్రకటించనున్నారు. ఈనెల 20 నుంచి 25 వరకు తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జరగనున్నది. రాష్ట్రంలో 20 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్న విషయం తెలిసిందే.
ఇందులో 2,650 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, పదిహేను శాతం (397) సీట్లు జాతీయ కోటాకు అప్పగించారు. మిగిలిన 2,253 సీట్లు రాష్ట్ర ప్రభుత్వ కోటా పరిధిలో ఉన్నాయి. ఇక, ఆరు స్వయం ప్రతిపత్తి హోదా(ప్రైవేటు) కల్గిన కళాశాలల్లో 760 సీట్లు ఉండగా, 470 సీట్లు ప్రభుత్వ కోటా కిందకు వచ్చాయి. అలాగే కేకేనగర్ ఈఎస్‌ఐలోని వంద సీట్లలో 65 రాష్ట్ర ప్రభుత్వ కోటా కింద ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న చెన్నై దంత వైద్య కళాశాలలో 85, 17 స్వయం ప్రతిపత్తి హోదా కల్గిన దంత వైద్య కళాశాలల్లో 970 బీడీఎస్ సీట్లు ప్రభుత్వ కోటా పరిధిలో ఉన్నాయి. వీటి భర్తీ నిమిత్తం రాష్ట్ర వైద్య విద్యా శాఖ గత నెల చర్యలు చేపట్టింది. ఈ నెల మొదటి వారం వరకు దరఖాస్తుల్ని ఆహ్వానించారు. ఈ సమయంలో కొత్తగా కోయంబత్తూరు ఈఎస్‌ఐ ద్వారా అదనంగా 65 ఎంబీబీఎస్ సీట్లు ప్రభుత్వ కోటా కింద రానుండడంతో విద్యార్థుల్లో ఆనందం నెలకొంది.
ఈ సీట్ల భర్తీ నిమిత్తం 24,100 వేల మంది కళాశాలల ద్వారా, 2,700 మంది ఆన్‌లైన్ ద్వారా నమోదు రూపంలో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. మొత్తంగా 25 వేల దరఖాస్తులు పరిగణలోకి తీసుకోవడంతో, వీటికి ర్యాండం నంబర్లను కేటాయించి మంగళవారం విడుదల చేశారు. ఈ ర్యాండం నంబర్లను వైద్య విద్యా శాఖ వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులు తెలుసుకునే వీలు ఉంది.
దీని ఆధారంగా అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. అలాగే, ఈనెల 17వ తేదీన ర్యాంకుల జాబితా ప్రకటిస్తారు. ఇందులో టాపర్లకు తక్షణ సీట్ల కేటాయింపులు ఉంటాయి. ఈ టాపర్లుగా ప్లస్‌టూలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వాళ్లే నిలవడం జరుగుతూ వస్తున్నది. ఇక, కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 20 నుంచి 25 వరకు తొలి విడతగా జరుగుతుంది. తదుపరి జూలై 18 నుంచి మలి విడత ప్రక్రియను ముగించి, ఆగస్టు ఒకటో తేదీ నుంచి కళాశాలలు ప్రారంభిస్తారని వైద్యవిద్యా శాఖ ప్రకటించింది.
ర్యాండం నంబర్ల విడుదల
Published Wed, Jun 15 2016 3:16 AM | Last Updated on Tue, Oct 16 2018 3:26 PM
Advertisement
Advertisement