స్కర్ట్ బదులు చుడిదార్
ప్రాథమిక విద్యాశాఖలో పదివేల పోస్టుల భర్తీకి చర్యలు
మంత్రి తన్వీర్‌సేఠ్
బెంగళూరు: ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఎనిమిది, పదో తరగతి చదువుతున్న విద్యార్థినులకు 2017-18 విద్యా ఏడాది నుంచి యూనిఫామ్‌గా షర్ట్, స్కర్ట్ బదులు చుడిదార్ పంపిణీ చేయనున్నామని రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి తన్వీర్‌సేఠ్ తెలిపారు. విద్యార్థినుల భద్రత దృష్టా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆమోదం తెలిపారన్నారు. బెంగళూరులో విధానసౌధలో శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రాథమిక విద్యాశాఖలో ప్రస్తుతం 14,580 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.
ఇందులో ఈ ఏడాది 10 వేల పోస్టులను భర్తీ చేయడానికి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నామన్నారు. మిగిలిన పోస్టులు వచ్చే ఏడాది భర్తీ చేస్తామన్నారు. వచ్చే ఏడాది నుంచి యూనిఫామ్‌తో పాటు పుస్తకాలు, షూ, సైకిల్స్ విద్యాఏడాది ప్రారంభానికి ముందే అందజేయనున్నామన్నారు. ఏడాది పాటు షూకు గ్యారెంటీ ఇచ్చే సంస్థలకు మాత్రమే టెండర్‌లో పాల్గొనేలా నిబంధనలు విధిస్తామన్నారు.