రాజధానికే పరిమితం కారాదు
కార్యాలయాల్లో దళారుల వ్యవస్థను నిర్మూలించండి
జిల్లా ఇన్‌చార్జ్ కార్యదర్శులకు సీఎం సూచన
బెంగళూరు: జిల్లాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు రాజధానిలోని కార్యాలయాలకు మాత్రమే పరిమితం కాకుండా గ్రామీణుల చెంతకు సంక్షేమ కార్యక్రమాలను చేరువ చేసే దిశగా పనిచేయాలని సీఎం సిద్ధరామయ్య సూచించారు. జిల్లా స్థాయిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ అధికారుల పనితీరును పర్యవేక్షించినప్పుడే అధికారులు మరింత బాధ్యతాయుతంగా పనిచేసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మంగళవారమిక్కడి విధానసౌధలో జిల్లాల ఇన్‌చార్జ్ కార్యదర్శుల సమావేశంలో సీఎం సిద్ధరామయ్య మాట్లాడారు. ‘కలెక్టర్లు, జిల్లా సీఈఓలుగా పనిచేసిన అనుభవం ఉందన్న కారణంతోనే మిమ్మల్ని జిల్లా ఇన్‌చార్జ్ కార్యదర్శులుగా నియమించాము. మీ అనుభవాన్ని ఉపయోగించి ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా దృష్టి సారించండి. తద్వారా పాలన వేగవంతం కావడంతో పాటు పాలనా వ్యవహరాల్లో మరింత పారదర్శకతను తీసుకురావచ్చు’ అని సూచించారు.
ఇక ఇదే సందర్భంలో ప్రతి నెలా జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. సరిగ్గా విధులు నిర్వర్తించని ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేయాలని, అప్పుడే ఇతర ఉద్యోగుల్లోనూ భయం వస్తుందని పేర్కొన్నారు. ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ‘దళారుల’ ప్రాబల్యం పెరిగిపోతోందని ఆరోపణలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయని, అందులోనూ తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, సాంఘిక సంక్షేమ శాఖ, గృహ నిర్మాణ శాఖ కార్యాలయాల్లో ఇది మరింత విస్తరించిందనే ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో కార్యాలయాల్లో దళారులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయండి.....
మైసూరు మహారాణి కాలేజీ హాస్టల్‌లోని విద్యార్థినుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్ పురుషోత్తమ్‌ను తక్షణమే సస్పెండ్‌చేయాలని ఉన్నత విద్యా శాఖ ప్రధాన కార్యదర్శి భరత్‌లాల్ మీనాను సీఎం సిద్ధరామయ్య ఆదేశించారు. ‘ఇటీవల నేను మైసూరులో పర్యటించినపుడు మైసూరు మహారాణి కాలేజీ హాస్టల్‌లోని ఓ విద్యార్థిని తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి కన్నీరు పెట్టుకుంది. అక్కడ నెలకొన్న అవకతవకలపై పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక అందజేయండి. మూడేళ్లలో అతను విద్యార్థినుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని రికవరీ చేసి తిరిగి విద్యార్థినులకు అందజేయండి’ అని అధికారులను ఆదేశించారు.