
ఏ ఒక్కరూ ఆకలితో అలమటించరాదు
సీఎం సిద్ధరామయ్య
బళ్లారి(దావణగెరె): రాష్ర్టంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించరాదన్న భావనతోనే అన్నభాగ్య పథకాన్ని ప్రవేశపెట్టినట్లు రాష్ర్ట ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. మంగళవారం దావణగెరె జిల్లా చెన్నగిరిలో ఏర్పాటు చేసిన తరళబాళు హుణ్ణిమె కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చిన్నతనంలో పడిన కష్టాలు, గడిపిన గడ్డు రోజులే రాష్ట్రంలో అన్నభాగ్య పథకం జారీకి కారణమయ్యాయని వివరించారు. రాష్ట్రంలో ప్రతి 100 మందిలో 24 మంది ఒక పూట భోజనానికి కూడా తల్లడిల్లుతున్నారని తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన తర్వాత చేపట్టిన సమీక్షలో తేలిందన్నారు.
దీనికి పరిష్కారం కోసమే ఈ పథకమని, ఇందుకోసం రూ. 4500 కోట్లు వెచ్చిస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి హెచ్.ఆంజనేయ మాట్లాడుతూ ఉబ్రాణి ఎత్తిపోతల పథకం మాదిరిగానే తరీకెరె, బుక్కుంబుది చెరువు 750 ఎకరాల విశాలమైన చెరువు అభివృద్ధి, చెన్నగిరి, తరీకెరె, దావణగెరె, చిత్రదుర్గంలోని 53 చెరువులకు నీటిని నింపే ఇంకా రెండు పథకాలను సిరిగెరె స్వామీజీ ప్రతిపాదించారన్నారు. వాటికి కూడా ముఖ్యమంత్రి నిధులు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సిరిగెరె మఠం తరళబాళు జగద్గురు డాక్టర్ శ్రీశివమూర్తి శివాచార్య స్వామీజీ, సాణెహళ్లి డాక్టర్ పండితారాధ్య శివాచార్య స్వామీజీ, రేణుక శివాచార్య స్వామీజీ, అభినవ సిద్ధలింగ శివాచార్య స్వామీజీ, ఎమ్మెల్యే వడ్నాళ్ రాజణ్ణ, మాజీ ఎమ్మెల్యే మాడాళు కె.విరుపాక్షప్ప, తుమ్‌కోస్ అధ్యక్షుడు హెచ్‌ఎస్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.