న్యూఢిల్లీ: మెట్రో రైలులో విహార యాత్ర చేయాలనుకుంటున్నారా.. అయితే వెంటనే మమ్నల్ని సంప్రదించండి.. అంటున్నారు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు. వచ్చే వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని పర్యాటకులను ఆకట్టుకోవడం ద్వారా తన ఆదాయాన్ని పెంచుకోవడానికి మెట్రో రైల్ కార్పొరేషన్ నిర్ణయించింది.
ఈ మేరకు వారు రిజర్వేషన్ ఆఫ్ కార్స్/ట్రైన్ విధానంలో భాగంగా ఎవరైనా టూర్ ఆపరేటర్లు, ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఏజెన్సీలు తమను సంప్రదించవచ్చని పేర్కొంది. డీఎంఆర్‌సీ కథనం ప్రకారం.. విదేశీ యాత్రికులు, టూరిస్టులు, ప్రభుత్వ లేదా ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు, వికలాంగుల కోసం ప్రత్యేక పాఠశాలలను నడిపే స్వచ్ఛంద సంస్థలు.. ఇలా ఎవరైనా మెట్రో రైలులో విహారయాత్ర చేద్దామనుకుంటే వెంటనే ఆ సంస్థ అధికారులను సంప్రదించవచ్చు.
దూరం, స్టేషన్ల బట్టి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు చార్జి వసూలు చేస్తారు. ఒక్కొక్క గ్రూప్‌లో 45 నుంచి 150 మంది వరకు ఉండవచ్చు. రైల్‌లో ఉన్న 8 కోచ్‌లలో ఒక్కో గ్రూప్‌నకు ఒక్క కోచ్‌ను మాత్రమే కేటాయిస్తారు.మెట్రో నెట్‌వర్క్‌కు సంబంధించి ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్‌తో సహా ఏ స్టేషన్ నుంచైనా బృందాలు కోచ్‌ను బుక్ చేసుకోవచ్చు. అయితే ప్రభుత్వ పాఠశాలలకు, స్వచ్ఛంద సంస్థల నిర్వహించే ప్రత్యేక పాఠశాలలకు ప్రత్యేక సదుపాయాల నిమిత్తం ఎటువంటి అదనపు చార్జీలు వసూలు చేయబోరు.
లెన్ 1,2,3/4లలో రూ.50 వేలు, 5వ లైన్‌లో రూ.30 వేలు, ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్ పైన రూ.40 వేలు వసూలు చేయనున్నట్లు వారు తెలిపారు. అయితే, ప్రత్యేక సదుపాయాల ఏర్పాటుకు వసూలుచేసే చార్జీలు వీటికి అదనం. ఈ ధరలు కూడా ప్రతి ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీనుంచి 10 శాతం పెరుగుతాయి.
ఈ యాత్రలో భాగంగా నామమాత్రపు చార్జీలకే మెట్రో మ్యూజియం, టెక్స్‌టైల్స్, చేనేత ఎగ్జిబిషన్‌ల సందర్శనకు ఆయా బృందాలకు అవకాశమిస్తారు. అలాగే ఆయా స్టేషన్లలో సదరు గ్రూపులకు స్వాగత తోరణాలు ఏర్పాటు, ప్రత్యేక ప్రకటనలు, ప్రయాణికులకు మెమెంటోలు అందజేయడం, కోచ్‌ను బుక్‌చేసుకున్న బృందానికి సంబంధించిన వాహనాలకు ఉచిత పార్కింగ్ సదుపాయం ఏర్పాటుచేయడమే కాక బృందసభ్యులకు యాత్ర సమయంలో మార్గదర్శకత్వం చేయడానికి ఒక వ్యక్తిని కూడా ఏర్పాటుచేసేందుకు డీఎంఆర్‌సీ నిర్ణయించింది.
ఇక మెట్రో విహారం..
Published Sun, Mar 23 2014 10:16 PM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM
Advertisement