సహనిర్మాత అశోక్‌కుమార్ (ఫైల్), ఫైనాన్సియర్ అన్బుచెళియన్
తమిళసినిమా: కోలీవుడ్‌లో అప్పుల బాధలు, ఆత్మహత్యలు అధికం అవుతున్నాయి. ఇలాంటి దుస్సంఘటనలు ఇంతకు ముందు లేవా అనే ప్రశ్న తలెత్తవచ్చు. ఉన్నాయి అయితే ఈ పరిస్థితి ఇప్పుడు అధికమించిందని చెప్పడం అతిశయోక్తి కాదు. గత 21వ తేదీన నటుడు శశికుమార్ అత్తకొడుకు, సహ నిర్మాత అశోక్‌కుమార్‌కు ఆత్మహత్యకు ప్రధాన కారణం అప్పుల భారమే. అందుకు ఫైనాన్సియర్ అన్బుచెళియన్ ఒత్తిళ్లు, బెదిరింపులు, అసభ్య దూషణలు ఒక కారణం కావచ్చు. అయితే ఫైనాన్సియర్ అన్బుచెళియన్‌ను కోలీవుడ్‌లో ఒక వర్గం తప్పు పడుతున్నా, మరో వర్గం ఆయనకు మద్దతు పలకడం గమనార్హం. మొన్నటి వరకూ ఫైనాన్సియర్ అన్బుచెళియన్‌కు వ్యతిరేకంగా గళం విప్పిన వారు ఇవాళ ఆయనకు అనుకూలంగా మాట్లాడుతున్నారు.
దర్శక నిర్మాత సీవీ.కుమార్ అయితే అన్బుచెళియన్‌పై ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసి సోమవారం ఆ కేసును వెనక్కి తీసుకున్నారు. అదే విధంగా పరారీలో ఉన్న అన్బుచెళియన్ ఆచూకీని పోలీసులు ఇంకా కనిపెట్టలేదు. ఆయన ఒక సీనియర్ మంత్రికి చెందిన వారి అండదండలున్నాయని, అందుకుగాను ఆయన్ని పోలీసులు కాపాడే ప్రయత్రం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే అశోక్‌కుమార్ బంధువు శశికుమార్‌ను మాత్రం పోలీసులు విచారిస్తున్నారు. అసలేం జరుగుతోంది? నిజంగా నిర్మాతల ఆత్మహత్యలకు కారణం కందువడ్డీలతో వేధిస్తున్న ఫైనాన్సియర్లేనా? వేరే కారణాలేమైనా ఉన్నాయా?
సంక్షోభానికి కారణం దర్శకులు, నటీనటులు కూడావేరే కారణాలు ఉన్నాయంటున్నారు కోలీవుడ్ వర్గాలు. అసలు చిత్ర పరిశ్రమ క్షీణించడానికి దర్శకులే కారణం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.చిత్ర నిర్మాణానికి సరైన ప్రణాళికలేని దర్శకులు, కోట్లలో పారితోషికాలు డిమాండ్ చేసే నటీనటులు కారణం అనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. నిర్మాత కేఎస్.శ్రీనివాసన్ పస్తుత పరిస్థితులపై స్పందిస్తూ, అశోక్‌కుమార్ ఆత్మహత్యకు ఫైనాన్స్ సమస్య మాత్రమే కాదన్నారు.మూడేళ్ల క్రితం తాను నిర్మించిన నిమిర్నుదు నిల్ చిత్రం కలిగించిన నష్టం నుంచి ఇప్పటికీ బయట పడలేకపోయానన్నారు. ఇంతకు ముందు దర్శకుడు ఎస్‌పీ.ముత్తురామన్ లాంటి వాళ్ల నిర్మాతల పరిస్థితులనడిగి ప్రణాళిక ప్రకారం చిత్రాలను పూర్తి చేసేవాళ్లని అన్నారు. ప్రస్తుత పరిస్థితులు చాలా ఘోరంగా తయారయ్యాయన్నారు.
షూటింగ్ చేయడం చాలా సులభం అని, షూటింగ్‌కు ముందు నటీనటులకు, సాంకేతికవర్గానికి కోట్ల రూపాయల్లో పారితోషికాలు చెల్లించి వెళ్లడం చాలా కష్టంగా మారిందని అన్నారు. రూ.కోటి అప్పు చేస్తే అది మూడు నెలలకు వడ్డీతో కలిసి రూ.1.70 కోట్లు చెల్లించాల్సి వస్తోందన్నారు. ఆత్మాభిమానానికి బాధ్యతకు మధ్య పోరాటంలో ఆత్మాభిమానం ఎక్కువ అయినప్పుడు ఆత్మహత్యలే శరణ్యం అవుతాయని అన్నారు. ఈ పరిస్థితి మారాలని, సినిమారంగంలో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొనాలంటే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. మొత్తం మీద సహ నిర్మాత అశోక్‌కుమార్ ఆత్మహత్య కోలీవుడ్‌ను కుదిపేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment