సాక్షి, చెన్నై: ప్రముఖ సినీ ఫైనాన్షియర్, నిర్మాత అన్బుచెళియన్ విదేశాలకు పారిపోయినట్లు పోలీసులకు ఆధారాలు దొరికినట్టు సమాచారం. ఇటీవల నటుడు శశికుమార్ అత్త కొడుకు, సహ నిర్మాత అశోక్‌కుమార్ రుణభారంతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆత్మహత్యకు ముందు అశోక్‌కుమార్ రాసిన లేఖలో అన్బుచెళియన్ ఒత్తిడి, ఆయన అనుచరులతో బెదిరించడమే తన మరణానికి కారణం అని పేర్కొనడం తీవ్ర కలకలానికి దారితీసింది. ఈ వ్యవహారంపై నటుడు శశికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్బుచెళియన్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్బు చెళియన్ చిత్ర నిర్మాణ సంస్థ గోపురం ఫిలింస్ కార్యాలయంలో సోదాలు నిర్వహించి కొన్ని కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.
ఆయన మేనేజర్ సాధిక్‌బాషా, వ్యక్తిగత కార్యనిర్వాహకుడు మురుసుకుమార్‌ను అరెస్ట్ చేసి విచారించారు. అయితే వారి నుంచి సరైన ఆధారాలు లభించలేదు. దీంతో పోలీసులు హైదరాబాద్, బెంగళూర్ వెళ్లి విచారణ చేపట్టారు. కాగా అన్బుచెళియన్ దేశం విడిచి అండమాన్ నుంచి కుటుంబం సహా పారిపోయారనే సమాచరం పోలీసులకు అందింది. అయితే అన్బుచెళియన్ విమానం ద్వారా విదేశాలకు పారిపోకుండా పోలీసులు లుక్‌అవుట్ పోస్టర్లను విమానాశ్రయాల్లో అంటించారు. దీంతో ఆయన చెన్నై నౌకాశ్రయం ద్వారా అండమాన్‌కు పారిపోయినట్లు సమాచారం. అక్కడి నుంచి కోల్‌కతా.. అటు నుంచి దుబాయ్ వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం అందిందని ఓ పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. కాగా అన్బుచెళియన్ 18 రోజులుగా అచూకీ తెలియకుండా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment