సంచలనాలు వద్దు..
- వార్తల్లో ఆలోచనల్ని రుద్ద వద్దు
- సమాచారాల్లో రీజినల్ మీడియాది కీలక పాత్ర
- కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్య
- చెన్నైలో సంపాదకుల సదస్సు ప్రారంభం
సాక్షి, చెన్నై
పోటీతత్వం పెరిగిన నేపథ్యంలో సంచలనాలు వద్దు అని, సత్యానికి దగ్గరగా సమాచారాన్ని చేరవేద్దామని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార, ప్రసారశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ప్రజలకు సమాచారాన్ని అందించడంలో రీజినల్ మీడియా కీలక పాత్ర పోషిస్తున్నదని కితాబు ఇచ్చారు. వార్తను, వార్తగానే చూద్దామని, అందులో ఆలోచనల్ని రుద్దవద్దు అని సూచించారు. కేంద్ర ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో చెన్నైలో గురువారం ప్రాంతీయ సంపాదకుల సదస్సు ప్రారంభమైంది. రెండు రోజుల ఈ సదస్సులో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఆయా పత్రికల సంపాదకులు, ప్రతినిధులు హాజరయ్యారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రసంగించారు. మీడియా రంగంలో పోటీతత్వం పెరిగిందని, సమాచార వ్యవస్థ విస్తృతమైందన్నారు. ఈ సమయంలో ప్రజలకు సమాచారాన్ని అందించడంలో సత్యానికి దగ్గరగా ఉందామని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం అన్ని రాష్ట్రాలను కలుపుకుని ముందుకు సాగుతోందన్నారు. ప్రభుత్వ పాలసీలను, పథకాలను, సమాచారాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రాంతీయ మీడియా కీలక పాత్ర పోషిస్తున్నదని కితాబు ఇచ్చారు. ఆయా ప్రాంతీయ భాషల్లో సమాచారాల్ని చేరవేయడం ద్వారా, అవి ప్రజలకు త్వరితగతిన చేరువవుతాయని వ్యాఖ్యానించారు.
మీడియాల్లో స్వయం నియంత్రణ, నిబంధ నలను పాటించాల్సిన అవసరం ఉందని సూచించారు. భావ వ్యక్తీకరణలో మీడియాకు స్వేచ్ఛ ఉందని అయితే కొన్ని విషయాల్లో సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. మానవ హక్కులు ఉన్నది మనుషుల కోసమని, తీవ్రవాదం కోసం కాదన్నారు. జాతి, మత, కులాల ఆధారంగా నిందితులు జైళ్లల్లో లేరని, నేరాన్ని బట్టి శిక్ష అనుభవిస్తున్నారన్నారు. ఇలాంటి అంశాల్లో మీడియా సంచలన వార్తలకు చోటు ఇవ్వకుండా, సంయమనంతో వ్యవహరించాలని విన్నవించారు. కేంద్రప్రభుత్వం రెండో దశలో 40 నగరాలను స్మార్ట్ సిటీలుగా ఎంపికచేసిందని, త్వరలో వీటిని ప్రకటిస్తామని తెలిపారు. సమావేశంలో తమిళనాడు సమాచార శాఖ మంత్రి కడంబూరు రాజు, పీఐబీ డెరైక్టర్ జనరల్ ఫ్రాంక్ నొరోన్హా, పీఐబీ ఏడీజీలు ముత్తుకుమార్, ఇరా జోషి పాల్గొన్నారు. అలాగే, 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను వెంకయ్యనాయుడు ప్రారంభించారు. తదుపరి జరిగిన సదస్సులో కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ పాల్గొని డిజిటల్ ఇండియా, సాంకేతిక విప్లవాలపై ప్రసంగించారు. ఈ సందర్భంగా పలువురు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు వారు సమాధానం ఇచ్చారు.