దిగజారిన దేశ ప్రతిష్ట
Published Mon, Mar 17 2014 1:11 AM | Last Updated on Tue, Aug 21 2018 9:38 PM
చెన్నై, సాక్షి ప్రతినిధి:కాంగ్రెస్ పాలనలో దేశ ప్రతిష్ట దిగజారిపోయిందని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎం వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. తీవ్రవాదం, అధికధరలు, అవినీతి, కుంభకోణాలతో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందని ఆయన దుయ్యబట్టారు. ‘మోడీ ఫర్ పీఎం’ పేరున చెన్నైలో ఆదివారం ఏర్పాటుచేసిన సభలో ఆయన ప్రసంగిస్తూ, ప్రాంతీయ విభేదాలు, ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం, తీవ్రవాదం వంటివాటిని కాంగ్రెస్ పెంచి పోషించిందని విమర్శించారు. దేశంలోని బడా పారిశ్రామికవేత్తలు విదేశాలకు వలస వెళుతున్నారని పేర్కొన్నారు. లోపభూయిష్టమైన విదేశీ విధానాల వల్ల పొరుగుదేశాలే శత్రుదేశాలుగా మారిపోయాయని, విధ్వంస రచనకు భారత్‌లోనే పాకిస్తాన్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసుకుందని పేర్కొన్నారు.
ప్రజలు పార్టీల గురించి కాదు దేశం గురించి ఆలోచించి ఓటువేయాలని కోరారు. భారత దేశంలో అన్ని వనరులు ఉన్నాయి, కావలసిందల్లా వాటిని దేశాభివృద్ధికి వినియోగించే సమర్థవంతమైన నాయకత్వమని పేర్కొన్నారు. దేశ ప్రజలంతా మార్పు కోరుతున్నారని, మోడీ వైపు చూస్తున్నారని చెప్పారు. అంధకారంలో కూరుకుపోయిన దేశానికి మోడీ ఒక ఆశాకిరణంలా ప్రజలు భావిస్తున్నారని అన్నారు. పన్నేండేళ్లుగా గుజరాత్ పాలనను గమనిస్తున్న దేశ ప్రజలు పీఎంగా మోడీ సమర్థుడని నమ్ముతున్నారని పేర్కొన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ, ప్రధాని అభ్యర్థిని మోడీని తమ పార్టీకాదు, ప్రజలే నిర్ణయించారని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తరువాతి నుంచి నేటి వరకు మూడు ఎన్నికలు మాత్రమే ప్రపంచ దృష్టిని ఆకర్షించాయన్నారు. దేశంలో నిర్వహించిన తొలి ఎన్నికలు, 1977 ఎమర్జెన్సీ తరువాతి ఎన్నికలు, ప్రస్తుత ఎన్నికలని స్పష్టం చేశారు. 1962 నుంచి ఇప్పటి వరకు డీఎంకే, అన్నాడీఎంకేలు లేకుండా ఏర్పడిన తొలి బలమైన కూటమి బీజేపీ మాత్రమేనని తెలిపారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఇల గణేశన్ మాట్లాడుతూ, మోడీ తన ప్రసంగాల్లో తనకు కాదు దేశానికి ఓటేయాలని కోరడం ద్వారా దుర్భర పరిస్థితిని పరోక్షంగా ప్రస్తావించారని తెలిపారు. మోడీ దేశమంతా తిరిగి ప్రసంగించాల్సిన అవసరం లేదని, ఒక్క రాహుల్‌గాంధీ ప్రసంగిస్తే చాలు..మోడీ ప్రధాని అయిపోతారని కాంగ్రెస్‌కు చురకలు అంటించారు. అవినీతిలో కాంగ్రెస్ పార్టీ ఒక చరిత్ర సృష్టించిందని ఎద్దేవా చేశారు. వీఐటీ ఫౌండర్ చాన్సలర్ జీ విశ్వనాథన్, శ్రీసిటీ చైర్మన్ రవి సన్నారెడ్డి, వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్, పలువురు తెలుగు ప్రముఖులు పాల్గొన్నారు.
Advertisement