మోదీ, జయ భేటీపై
వెంకయ్యనాయుడు వ్యాఖ్య
అన్నింటికీ కాంగ్రెస్ వక్రభాష్యాలు
కాంగ్రెస్ వారు అభివృద్ధి నిరోధకులు
చెన్నై, సాక్షి ప్రతినిధి: ‘దేశ ప్రధాని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిస్తే తప్పేంటి, పీఎం, సీఎంల మధ్య మంచి సంబంధాలు ఉండడం మంచిదేకదా, కాంగ్రెస్ పార్టీ అన్నింటికీ వక్రభాష్యాలు పలుకుతుంది’ అంటూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విరుచుకుపడ్డారు. చెన్నైలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమిళనాడు అత్యంత అవినీతిమయ రాష్ట్రమని భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అమిత్‌షా వ్యాఖ్యానించిన నేపథ్యంలో ప్రధాని మోదీ సీఎం జయను కలవడం ఎంతవరకు సమంజసమని మీడియా ప్రశ్నించగా ‘ జాతీయ చేనేత దినోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన నేపధ్యంలోనే జయను కలిసారు, అవినీతి రహిత పాలనపై ఇద్దరూ చర్చించుకుని ఉండొచ్చుకదాని బదులిచ్చారు.
బీజేపీ, అన్నాడీఎంకేల మధ్య సాగుతున్న రహస్య సంబంధాలు బట్టబయలైనాయని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని మీడియా కోరగా, ప్రధాని, ముఖ్యమంత్రుల మధ్య సుహృద్భావ వాతావరణం ఎంతో అవసరమని, పీఎం, సీఎంలు అధికారికంగా కలుసుకుంటే తప్పేమిటని అన్నారు. ఇతర పార్టీ నేతలతో రహస్య ఒప్పందాలు, సంబంధాలు కాంగ్రెస్ పార్టీకి అలవాటు, అందుకే వారు లేనిపోని వ్యాఖ్యానాలు చేస్తున్నారని విమర్శించారు. తమిళనాడులో సాగుతున్న మద్య నిషేధ పోరాటంపై వెంకయ్య వ్యాఖ్యానిస్తూ ప్రజలు ముక్తకంఠంతో కోరుకున్నపుడు ప్రభుత్వం తలొగ్గక తప్పదని, అయితే మద్యంపై పోరులో రాజకీయాలు మాత్రం తగదని అన్నారు.
కేంద్రంలో అవినీతి రహిత పాలన: బీజేపీ 14 నెలల పాలనలో ఒక్కస్కాం, కుంభకోణానికి తావివ్వలేదని, పైగా దేశ ప్రతిష్ట ఇనుమడించిందని చెప్పారు. కొత్త పెట్టుబడులు వస్తున్నాయి, జీడీపీ వృద్ధి, ఆర్థికప్రగతికి దోహదపడే అనేక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. అయితే బీజేపీ ప్రభుత్వ విజయాలను సహించలేని కాంగ్రెస్ నేతలు అభివృద్ది నిరోధక శక్తులుగా తయారైనారని ఆయన దుయ్యబట్టారు. ఆధికారంలో ఉన్నపుడు దేశాభివృద్ధిని విస్మరించారు, ప్రతిపక్షంలో కూర్చుని నేడు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అన్నారు. గడిచిన పార్లమెంటు ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ నేటికీ జీర్ణించుకోలేక పోతున్నదని అన్నారు. పార్లమెంటులో చర్చిందేకు తాము అనుమతిస్తే, రోడ్లపై ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు. నాలుగు కీలకమైన బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొంది, రాజ్యసభ ముందున్నాయని తెలిపారు.
ప్రధాని మోదీని అప్రతిష్టపాలు చేయాలనే సంకల్పంతో దేశానికి అప్రతిష్ట తెవడమేగాక, కాంగ్రెస్ నేతలే అప్రతిష్టపాలవుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీకి స్పష్టమైన మెజార్టీతో అధికారం కట్టబెడుతూ ప్రజలు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ నేటికీ జీర్ణించుకోలేక పోతున్నదని అన్నారు. దేశాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే వెనక్కు నెట్టేందుకు కాంగ్రెస్ కుటిలపన్నాగాలు పన్నుతోందని విమర్శించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది, అనేక ముఖ్యమైన బిల్లును ఆమోదించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. సోమవారం నుంచైనా పార్లమెంటు సమావేశాలకు కాంగ్రెస్ సభ్యులు సహకరించాలని కోరారు. యూకుబ్ మెమన్‌ను ఉరితీయడంపై ఒక మతవారు విమర్శించడం సరికాదని అన్నారు. ఒక తీవ్రవాదిని కులమతాలతో చూడడం సరికాదు, తీవ్రవాదిని తీవ్రవాదిగానే చూడాలని అన్నారు.
అందులో తప్పేంటి?
Published Mon, Aug 10 2015 3:08 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement